దేశంలో న్యాయస్థానాలు కూడా ఇటీవల విచిత్రంగా స్పందిస్తున్నాయి. వాళ్ళు అందుకు ఏఏ పాత కేసులను ప్రమాణంగా తీసుకుంటున్నారో తెలియదు కానీ, తీర్పులు మాత్రం చాలా విచిత్రంగానే ఉంటున్నాయి. అవన్నీ నిజానికి ఆయా కుర్చీలలో కూర్చున్న న్యాయదేవత ప్రతినిధి ఇస్తున్నావో లేక వారిని ఎవరైనా ప్రభావితం చేయడం వలన ఇస్తున్నావో అర్ధం కావడం లేదు. అంత దూరం ఎందుకు కానీ, సహజంగానే వ్యవస్థలను నేతలు వాడేసుకుంటున్నారనేది దేశంలో ఎప్పటి నుండో ఉన్నమాట. అందుకే నేరాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే నేరం చేసినా శిక్ష పడేలోపు పుణ్యకాలం గడిచిపోతుంది అనేది వాళ్లకు అర్ధం అవుతుంది. ఒకవేళ కోర్టు మెట్లు ఎక్కినా కూడా ఏదో ఒక లూప్ హోల్ తో బయటపడొచ్చు లేదా మనల్ని కాపాడటానికి కూడా మనవైపు నుండి ఒక నల్లకోటు ఉంటుంది కదా అనే ధీమా.

ఎలాగూ వాదికి, ప్రతివాదికి కూడా నల్లకోట్ల అవసరం ఉంటుంది. ఒకరు న్యాయాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంటారు, మరొకరు అన్యాయాన్ని శిక్ష వరకు వెళ్లకుండా ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. మళ్ళీ ఈ రెండు నల్ల కోట్లు కూడా న్యాయాన్ని కాపాడతాం అని పట్టా పుచ్చుకున్నప్పుడు న్యాయదేవత ముందు ప్రమాణాలు చేసినవే. కానీ అవే న్యాయాన్ని కూలదోయడానికి కూడా ప్రయత్నిస్తున్నప్పుడు, ఆ నల్లకోట్లు కూడా నేరస్తుల కిందకు రారంటారా న్యాయస్థానం వారు, నాకో సందేహం వచ్చింది. అందుకే అడిగాను. మీకే దిక్కులేదు, నేతలు ఏది చెపితే అది రాసి, చదివి పోతున్నారు కాబట్టి, నా సందేహం తీర్చలేరని నాకు తెలుసు. అయినా మీ పరిధిలో ఉందేమో అని ఉండబట్టలేక అడిగేశాను.

ఒకే న్యాయస్థానంలో మూడు నల్లకోట్ల మధ్య న్యాయం నలిగిపోతుంది. బహుశా వారిలో న్యాయాన్ని కాపాడాలనుకునే వారు కూడా ఉండొచ్చుగాక. మరి అన్యాయాన్ని కాపు కాచే నల్లకోట్ల పరిస్థితి ఏమిటో చెప్పండి న్యాయస్థానం వారు. వాళ్లకు కూడా తప్పు చేసిన పోలీసుల మాదిరి కొంతకాలం సస్పెండ్ చేసి, ఎంజాయ్ చేయమని సేవల మీద పంపిస్తారా లేక శాశ్వత శిక్షలు ఏమైనా ఉండనున్నాయా? ఉంటాయని నాకు నమ్మకం లేదనుకోండి, అయినా ఓ ఉత్సుకత ఆపుకోలేక అడిగేశాను. ఈ వ్యవస్థలలో లోపాలను సరిచేయాలంటే, చేనును మేస్తున్న కంచెకు కూడా శిక్ష తప్పకుండ ఉండాలి. లేకపోతే న్యాయం న్యాయదేవత ముందే జీవచ్ఛవం అయిపోతుంది, గమనించగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: