ఆవుల్లో పుంగనూరు ఆవు ప్రత్యేకత వేరు.. పుంగనూరు ఆవు పాలలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. అంతే కాదు.. పుంగనూరు ఆపు పాల చాలా రుచిగా కూడా ఉంటాయి. సాధారణంగా  మామూలు ఆవు పాలలో 3.5 శాతం వరకూ వెన్న ఉంటుంది. కానీ.. ఈ పుంగనూరు ఆవు పాలలో మాత్రం ఏకంగా  6 నుంచి 8 శాతం వరకూ వెన్న ఉంటుంది. అంతే కాదు.. ఈ పాలు సుగంధ వాసనలతో, ఆయుర్వేద గుణాలతో ఉంటాయని చెబుతారు. ఈ పుంగనూరు ఆవు పాలలో వెన్నశాతం ఎక్కువగా ఉన్నా..  కొవ్వు పదార్థాలు మాత్రం  తక్కువగా ఉంటాయని  అక్కడి రైతులు చెబుతున్నారు.


ఈ పుంగనూరు ఆవులు చూస్తే ఇట్టే గుర్తు పట్టేలా ఉంటాయి. వీటికి చిన్న చెవులు, మూపురం ఉంటాయి. అలాగే.. పుంగనూరు ఆవుల తోక నేలకు ఆనుతుంది. గంగడోలు కిందకు రావడం, ముందు కాళ్లు పొడవుండి వెనక కాళ్లు పొట్టిగా ఉండటం పుంగనూరు ఆవుల లక్షణాలు. ఈ  లక్షణాల ద్వారా అసలైన పుంగనూరు ఆవులను గుర్తిస్తారు. అయితే రాను రాను.. ఈ ఆవుల జాతి అంతరించిపోతోంది. వీటిని పెంచేవారు కరవయ్యారు. అసలైన పుంగనూరు జాతి ఆవులు లభ్యం కావడం లేదు.


అందుకే ఈ సమస్యకు బయోటెక్నాలజీతో పరిష్కారం చూపించారు సైంటిస్టులు. ప్రస్తుతం దేశంలో ఈ పుంగనూరు రకం ఆవులు కేవలం 500 మాత్రమే ఉంటాయట. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న ఆవు జాతుల్లో ఈ పుంగనూరు జాతి కూడా ఒకటి. అందుకే ఈ పుంగనూరు జాతికి చెందిన ఆవులను కృత్రిమ గర్భధారణ పద్ధతి ఐ వీ ఎఫ్‌ ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఈ పద్దతిలో ఓ పుంగనూరు ఆవు దూడ జన్మించింది.


ఇలా దేశంలో ఐవీఎఫ్‌ సాంకేతికతను ఉపయోగించి పురుడు పోసుకున్న తొలి పుంగనూరు ఆవు దూడ ఇదేనట. దేశీయంగా అంతరించిపోతున్న పశువులను సంరక్షించే లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. అరుదైన గోవులను రక్షించేందుకు మహారాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఐవీఎఫ్‌ పద్ధతిని ప్రోత్సహిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: