అందాల భాగ్యనగరానికి మరో ఆకర్షణ రాబోతోంది. ఇప్పటికే అనేక పర్యాటక ప్రాంతాలతో అలరారుతున్న హైదరాబాద్‌ కు ఇప్పుడు మరో అదిరిపోయే ప్రాజెక్టు రాబోతోంది. ఇప్పటికే ఇటీవల దుర్గం చెరువు వద్ద ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి పర్యాటకులను, నగర వాసులను ఎంతగానో అలరిస్తోంది. ఇప్పుడు అదే తరహాలో మరో అదిరిపోయే ఆకర్షణీయ ప్రాజెక్టును జీహెచ్‌ఎంసీ ప్లాన్‌ చేస్తోంది.


ఇప్పటికే అనేక హంగులతో పర్యాటకులను ఆకర్షించే హుస్సేన్‌సాగర్‌ పై కూడా ఇప్పుడు మరో వేలాడే వంతెన ఏర్పాటు చేయబోతోంది జీహెచ్‌ఎంసీ.. మాస్కోలో ఇప్పటికే ఉన్న ఓ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌పై కూడా వేలాడే వంతెన నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మాస్కోలోని మోస్క్వా నదిపై ఉన్న వేలాడే వంతెన తరహాలో హుస్సేన్‌ సాగర్‌పైనా ప్లాన్‌ చేస్తున్నామని సోషల్ మీడియాలో ఆ ఫోటో పోస్టు చేశారు.


మాస్కోలోని నదీ తీరంలోని తేలియాడే వంతెన తరహాలో హుస్సేన్‌ సాగర్‌ వద్ద ఈ ఏడాది ఆఖరు నాటికి నిర్మాణం ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ వంతెన నెక్లెస్‌ రోడ్డులోని వీపీ ఘాట్‌ వద్ద ఏర్పాటు చేస్తారట. మాస్కోలో మోస్క్వా నదిపై ఉన్న తేలియాడే వంతెన అక్కడ పర్యాటకులను బాగా ఆకర్షిస్తోందట. హైదరాబాద్‌ నడిబొడ్డున ప్రకృతి ఇచ్చిన వరంగా హుస్సేన్‌ సాగర్ ఉంది. మన హుస్సేన్ సాగర్ వద్ద కూడా సాగర్‌ లోపలకి యూ ఆకారంలో ఈ వేలాడే వంతెన ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.


హుస్సేన్‌ సాగర్ ఒడ్డున మొదలయ్యే ఈ వంతెన.. అలా హుస్సేన్ సాగర్‌ జలాల్లోకి యూ ఆకారంలో చొచ్చుకుపోతుంది.. ఎలాంటి పిల్లర్లు లేని ఈ వంతెన ఎక్కితే.. హుస్సేన్‌ సాగర్‌ పై గాల్లో తేలుతున్నట్టు అనుభూతి పొందవచ్చు. హుస్సేన్‌ సాగర్‌ లోపల ఎలాంటి స్తంభాలు లేకుండా రోప్‌వే ద్వారా దీనిని తీర్చిదిద్దుతారు. ఇప్పటికే దుర్గం చెరువుపై ఇలాంటి టెక్నాలజీతోనే కేబుల్‌ బ్రిడ్జి ఏర్పాటు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: