సెల‌వు కదండి లేస్ ప్యాకెట్ కొనుక్కోండి
ఆహా నో ఓహోనో స‌బ్ స్క్రైబ్ చేసుకోండి
థ‌మ్స‌ప్ టు లీట‌ర్ బాటిల్ ను  ఫ్రిజ్ లో ఉంచమ‌నండి అమ్మ‌ను.
అమ్మా నాన్న‌ల‌తో క‌లిసి ఓ దేశ‌భ‌క్తి సినిమా చూసి
విన‌రా విన‌రా దేశం మ‌న‌దేరా అని పాడుకుంటూ లేస్ ప్యాకెట్ ను
అవ‌గొట్ట‌మ‌నండి.అయిపోయింది క‌దండీ ..గ‌ణ తంత్రం మ‌రియు ఘ‌న తంత్రం



ఈ పాటిదానికి మ‌నం ఎందుకు రోడ్డెక్కాలి మ‌నం ఎందుకు హ‌క్కుల కోసం రాద్ధాంతం చేయాలి..ఆ ప‌నులు మీవి కావు కదా! క‌నుక ఏం జ‌రిగినా నోర్మూసుకుని ప‌డి ఉండండి. తెచ్చి పెట్టుకున్న సంతోషాల చెంత ఈ సెల‌వు రోజును హాయిగా గ‌డ‌పండి..ఏం కాదు?
క‌ష్టాల‌ను భ‌రించి సుఖాల‌ను ఆహ్వానించి దేశానికి ఓ గొప్ప పండ‌గ అన్న‌ది ఇవాళ వ‌చ్చింద‌ని అనుకోవాలి.భార‌తీయులు మురికి వాడ‌ల‌లో మంచి చైత‌న్యం ఆశించ‌డం లేదు. తోటి వారి  ఉన్న‌తిలో త‌మ భాగం పంచుకోవడం లేదు. భార‌తీయులు నిర్ల‌క్ష్యంగా ఉంటూనే, ఎంద‌రి జీవితాల‌నో ఛిద్రం చేస్తున్నారు. భార‌తీయుల నిర్ల‌క్ష్య ధోర‌ణి కార‌ణంగానే కొన్ని యుద్ధాలు వ‌స్తున్నాయి.అవి నేరు యుద్ధాలు కాకున్నా బ‌యో వార్ మాత్రం సుస్ప‌ష్టం అవుతోంది. మ‌న ప్ర‌జ‌లకు ఇంకా కొన్ని నేర్పాలి. గ‌గ‌న వీధుల్లో మ‌నం విజేతలం  కానీ మ‌న వీధిలో ఓ అమ్మాయిని  గౌర‌వించ‌లేని దౌర్భాగ్యానికి ప్ర‌తినిధులం. క‌నుక కులం పోదు..మ‌తంపోదు..కండ కావరం అన్న‌ది అస్స‌లు పోదు.వివ‌క్ష అనే జాడ అస్స‌లు పోదు. మ‌నం వినిపించే స్వేచ్ఛ మ‌న‌ది కాదు. మ‌నం పాటించే సంస్కృతి మ‌న‌ది కాదు. దేశానికి ఓ గొప్ప సంద‌ర్భం అయితే ఇది కాదు. ఏమ‌న్న‌ది ఏంట‌న్న‌ది ఎవ‌రికి వారు వెతుక్కుంటే కొత్త రోజులు వ‌స్తాయి.అవి  మంచి రోజులు అవుతాయా కాదా అన్న‌ది వేరొక చ‌ర్చ.


ముఖ్య‌మ‌యిన రోజులు కొన్ని ముఖ్య‌మయిన సంద‌ర్భాలు కొన్ని జీవితాల‌ను ప‌ల‌క‌రిస్తాయి.అవునో కాదో కానీ మ‌న భార‌తీయ స‌మాజం విశిష్టం అయిన రోజుల‌ను,విశిష్టం అనుకునే సంద‌ర్భాల‌ను ఓ పెద్ద పండగ‌లా సెలబ్రేట్ చేసుకుంటాయి. లేదా ఆ విధంగా సెల‌బ్రేట్ చేసుకున్నామ‌ని అనుకుంటోంది కానీ అది నిజంగా నిజం కాదు. అబ‌ద్ధంలో అబ‌ద్ధం.విశిష్టం అయిన అబ‌ద్ధం అంటే ఇదే!

గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన ఏం  చేయాలి.రాజ్యాంగం ఇచ్చిన హ‌క్కులేంటి..పౌరుల విధులేంటి? పౌరు హ‌క్కుల ఉల్లంఘ‌న‌ల‌లో ప్ర‌భుత్వాల ప్ర‌మేయం ఏంటి? ఇవి క‌దా తెలుసుకోవాలి.లేదండి ఖ‌డ్గం సినిమాను ఓ వందో సారి చూసి అల్ల‌రి అల్ల‌రి చూపులతో అన్న పాట ను మ‌రోసారి విని, ఆఖ‌రులో మేమే ఇండియ‌న్స్ అని అనుకోవ‌డంలో సూడో పేట్రియాటిజం ఉంద‌ని నిర్థారించుకోవాలి
ఎవ‌రికి వారు.

అయినా దేశానికి మ‌నం ఏమీ ఇవ్వ‌డం లేదు.ఇవ్వ‌క‌పోవ‌డం నేరం కాదు. కానీ దేశాన్నీ, చుట్టూ ఉన్న స‌మూహాల‌నూ అదే ప‌నిగా తిట్ట‌డం అన్న‌దే త‌ప్పు.ఆ త‌ప్పు ఎవ్వ‌రూ చేయ‌కూడ‌దు. ఎందుకంటే దేశ ప్ర‌గ‌తిలో మ‌నవంతు పాత్ర ఏంత‌న్న‌ది ఏంట‌న్న‌ది తెలుసుకోవాలి. అయినా దేశం ఇప్ప‌టిక‌ప్పుడు మొద్దుబారిన మెద‌ళ్లు ఉన్న వారిని మార్చ‌లేదు.అదేవిధంగా మొద్దు నిద్రలో ఉన్న వారినీ మార్చ‌లేదు.దేశం సోమ‌రిపోతుల మ‌యం.. ఊసురోమ‌ని మ‌నుషులుంటే దేశ‌మే గ‌తి బాగుప‌డునోయ్  అన్న క‌వి గుర‌జాడ మాట‌లు మ‌రో సారి గుర్తు చేసుకుని తీర‌డం ఈ సంద‌ర్భంగా బాధ్య‌త.


మరింత సమాచారం తెలుసుకోండి: