ఈ కాలం పిల్లలకు ప్రకృతి గురించి అవగాహన తక్కువ. అందుకే.. ‘‘ మొక్కలు నాటే ముందు, వాటి గురించి ఖచ్చితంగా  తెలుసుకోండి. అన్ని మొక్కలు  ఆక్సిజన్ ఇవ్వవు. కొన్ని మొక్కలు పంటలను నాశనం చేస్తాయి.  మనకు ఆహారం లేకుండా చేస్తాయి. వాటిని నివారించడం కూడా తెలుసుకోవడమే అసలైన పర్యావరణం. ’’ అని  హెచ్చరిస్తున్నాడు కొమెర జాజి.


కొమెర జాజి పొద్దు పొడవక ముందే నల్లమల అడవుల్లోకి వెళతాడు. అతడి కోసమే ఎదురు చూస్తున్న పక్షులు చుట్టూ చేరతాయి. గుప్పెడు జొన్న గింజలు వాటికి వేస్తాడు. కృతజ్నతగా ఆ పిట్టలు  జాజికి  అరుదైన మొక్కలను పండ్లను, ఆకులను చూపిస్తాయి. వాటిని గుర్తుపెట్టుకుంటాడు. మర్నాడు  కొందరు స్కూల్  విద్యార్దులను తీసుకెళ్లి ఆ మొక్కలను చూపించి వాటి  వేర్లు, కాండం, బెరడు, ఆకులు, మొగ్గలు, పూలు, కాయలు, పండ్లు, గింజలు, చిగుళ్ల లోని ఔషధ గుణాలను వివరిస్తాడు. అడవికి కృతజ్ఞతగా ఆ చిన్నారులు ఆ మొక్కలను తమ పెరట్లో, స్కూల్ గ్రౌండ్లో పెంచుతారు. నల్లమల అతడి శ్వాస.


ఆకుపచ్చని భవిష్యత్ చిత్రపటం సృష్టించాలనే తపనతో,  కాలుష్యం వెదజల్లుతున్న సమాజం  మధ్య సన్న జాజి తీగలా అల్లుకుంటున్న కొమెర జాజి  గుంటూరు జిల్లా కారంపూడి గ్రామం నివాసి. ఎం.ఎ చదివారు. నిత్యం సమీపంలోని నల్లమల అడవుల్లో తిరుగుతూ అరుదైన ఔషధ మొక్కలు కనిపెట్టి, వాటిని అందరికీ పరిచయం చేస్తుంటారు. ఒక్కో సారి మొక్కల ఆన్వేషణలో చీకటి పడిపోతుంది. అలాంటపుడు తనతో పాటు తెచ్చుకున్న టెంట్ని వేసుకొని రాత్రికి అక్కడే ఉండి తెల్లవారు జామునే వనమూలికల అన్వేషణ మొదలు పెడతాడు. ఆ ప్రాంతం వారికి ప్రకృతి వన మూలికా నిపుణుడుగా సుపరిచితుడు.


గత 3 నెలలుగా అందుబాటులో ఉన్న పాఠశాలలకు వెళ్లి ఒక గంట ప్రకృతి పాఠాలను ఉచితంగా చెబుతున్నారు జాజీ. ఇప్పటికే వందకు పైగా క్లాసులు తీసుకున్నారు. తమ ప్రాంతంలో ఉన్న నల్ల మల అడవికి పిల్లలను తీసుకెళ్లి ప్రతీ మొక్కను,వేర్లను పరిచయం చేస్తున్నాడు. ‘‘ ప్రాక్టికల్గా మొక్కలను చూపించి, ఆకట్టుకునేలా సరళంగా చెప్పే  జాజి క్లాసులు మా విద్యార్దుల్లో చాలా మార్పు తెచ్చాయి. అడవులంటే ఏవో చెట్లు కాదు... క్రిములు కీటకాలు పక్షులు నీళ్లు జలచరాలు జంతువులు నాచు తేమ... ఇవన్నీ అడవిలో భాగం... అవన్నీ ఒకదానిపై మరొకటి ఆధారితం అని పిల్లలు అవగాహన చేసుకుంటున్నారు. స్కూల్ గ్రౌండ్లో కొన్ని ఔషధ మొక్కలు నాటి కాపాడుతున్నారు. ఏమీ ఆశించ కుండా ఇంత విలువైన జ్ణానం పంచుతున్న జాజి లాంటి యవకుడు ఈ సమాజానికి గొప్ప స్ఫూర్తి.’’ అంటారు గుంటూరు జిల్లా ,కోచర్ల కు చెందిన టీచర్ రాములు నాయక్. రూరల్‌ మీడియా  సంస్ధ సహకారంతో ప్రకృతి పాఠశాలను  రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్ధుల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: