ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పండుగ పూట సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు శరాఘాతంగా మారింది . బస్సులు నడవకపోవడం తో రైళ్లన్నీ  కిటకిటలాడుతున్నాయి . సికింద్రాబాద్, కాచిగూడ ,  నాంపల్లి రైల్వే స్టేషన్లలో పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులతో నిండిపోయాయి .  రైల్వే స్టేషన్ లో కాలుపెట్టడానికి వీల్లేకపోవడం తో చిన్న , పెద్దలు తీవ్ర ఇబ్బదులు  పడుతున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ లో  రైళ్లు ఎక్కే ప్రయత్నం లో  ప్రయాణికులు మధ్య తీవ్ర  తోపులాట జరిగింది . ప్రయాణికులను స్టేషన్ లో  విధుల్లో ఉన్న  పోలీసులు ఎంతో  వారించే ప్రయత్నం చేశారు .


అయినా  ప్రయాణికులు మాత్రం అదేమీ   పట్టించుకోకుండా, రైల్  ఎక్కాలనే ఆరాటం తో ఒకర్ని,  మరొకరు తోసుకుంటూ ముందుకువెళ్తుండడంతో పలువురికి గాయాలయ్యాయి . దీనితో చేసేది లేక పోలీసులు   లాఠీ ఛార్జ్ చేసి ప్రయాణికులను చెదరగొట్టారు . క్యూ లైన్ ద్వారా ప్రయాణికులను రైళ్లు ఎక్కించే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు . మరో రెండు రోజుల్లోనే దసరా పండుగ కావడంతో బంధువులు , కుటుంబ సభ్యులతో కలిసి సొంతూళ్లో పండుగ జరుపుకోవాలనుకునే నగరవాసులు, పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు పయనమయ్యారు . దూర ప్రాంతాలకు బస్సులు నడవకపోవడం , నడిచిన ప్రైవేట్ బస్సుల యాజమాన్యం నిలువు దోపిడీ చేస్తుండడం తో చేసేది లేక రైల్వేను ఆశ్రయిస్తున్నారు .


 పండుగ పూట రైల్వే యాజమాన్యం కూడా అదనపు రైళ్లను నడపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రయాణికులు మండిపడుతున్నారు . ఒకవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలిసి కూడా రైల్వే యాజమాన్యం అదనపు రైళ్లను నడపకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . సాధారణంగా బస్సులు నడిచే సమయంలోనే పండుగలకు సొంతూళ్లకు వెళ్లాలంటే రద్దీ తీవ్రంగా ఉంటుందని, అటువంటప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మె వల్ల బస్సుల నిర్వహణ అంతంతా మాత్రమే ఉన్న ప్రస్తుత తరుణం లో అదనపు రైళ్లు నడిపి ఉంటే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేవని అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: