ఇటీవ‌లి కాలంలో....ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల డైటింగ్ పేరుతో తిండి మానేయ‌డం అనే అల‌వాటు పెరిగిపోయిన సంగ‌తి తెలిసిందే. బరువు తగ్గాలనుకోగానే అందరి దృష్టి ముందుగా డైటింగ్‌ వైపే వెళ్తుంది. రకరకాల డైటింగ్‌ సూత్రాల కోసం చూస్తుంటారుగానీ వ్యాయామంపై మనసు పెట్టరు. పెద్ద వయసు వాళ్లు కూడా ఇలాగే చేస్తుంటారు. కాళ్లనొప్పులనో, మరో కారణమో చూపి వాకింగ్‌ లాంటి వ్యాయామాలు కూడా మానేస్తుంటారు. తిండి తగ్గిస్తుంటారు. కానీ దీనివల్ల ఎముకల పటుత్వం తగ్గి తొందరగా ఎముకలు విరిగే అవకాశం ఉంటుందంటున్నారు.


వాషింగ్టన్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ డెన్నిస్‌ విల్లేరియల్‌ బృందంచేసిన అధ్యయనంలో ఆస‌క్తిక‌ర‌ విషయాలు వెల్లడయ్యాయి. డైటింగ్‌ చేసేవారిలో శరీరం బరువే కాదు.. ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుందని పరిశోధన‌లో వెల్ల‌డైన‌ట్లు ఆయ‌న తెలిపారు. అందుకే డైటింగ్‌ వల్ల వృద్ధుల్లో మాదిరిగా ఎముకలు విరిగే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించారు. 57 ఏళ్లు పైబడిన వాళ్లపై చేసిన ఈ అధ్యయనంలో బరువు తగ్గడానికి కొందరు కేవలం డైటింగ్‌పై ఆధారపడగా, మరికొందరు మాత్రం వ్యాయామం కూడా చేశారు. వ్యాయామం చేయకుండా తిండి మాత్రమే తగ్గించినవాళ్లలో బరువుతోపాటు ఎముకల సాంద్రత కూడా తగ్గుతున్నట్టు గమనించారు. అది కూడా వయసు రీత్యా దెబ్బతినే తుంటి, ఎముకలు, వెన్నెముక భాగాల్లోనే ఈ తగ్గుదల కనిపించింది.


వ్యాయామం వల్ల కండరాలతోపాటు ఎముకల పటుత్వం కూడా పెరుగుతుంది. అందుకే డైటింగ్‌ కన్నా ముందు వ్యాయామంతో బరువు తగ్గించుకొనే ప్రయత్నం చేయాలని అధ్యయనకారులు సూచిస్తున్నారు . లేదంటే....అకాల వృద్ధాప్యానికి గురవుతున్నట్టే పరిశోధకులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో...ఇటు బ‌రువును దృష్టిలో ఉంచుకోవ‌డ‌మే కాకుండా...అకాల వృద్ధాప్యం వంటి స‌మ‌స్య‌ల‌ను సైతం ధృష్టిలో ఉంచుకోవాలని నిపుణులు చెప్పే విష‌యాన్ని పాటించ‌డం ఎవ‌రికి వారు నిర్ణ‌యం తీసుకోవాల్సిన అంశ‌మే.


మరింత సమాచారం తెలుసుకోండి: