ఆర్టీసీ కార్మికుల సమ్మె మెట్రో రైలుకు కాసుల పంట పండిస్తోంది.  సోమవారం మెట్రో రైలు లో  3 .80 లక్షల  మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇటీవల 3 . 75 లక్షల  మంది ప్రయాణికులు ప్రయాణించి  రికార్డు నెలకొల్పగా,  సోమవారం ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.  ఆర్టీసీ సమ్మె నేపద్యంలో నగరవాసులు మెట్రో ను ఎక్కువగా  ఆశ్రయిస్తున్నారు.  ఆర్టీసీ బస్సులు అరకొరగా నడుస్తుండడం,  ప్రైవేటు వాహనదారులు ముక్కుపిండి ప్రయాణికుల వద్ద అధిక  డబ్బులు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు మెట్రో లో  ప్రయాణించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. 


ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లన్నీ   కిక్కిరిసిన ప్రయాణికులతో గమ్యస్థానాలు వైపు దూసుకు వెళుతున్నాయి . ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు పలు రూట్లలో మెట్రోరైలన్నీ  రద్దీగా ఉంటున్నాయి .  ఎల్బీనగర్ -  మియాపూర్ రూట్  రద్దీ అనూహ్యంగా పెరిగిన పెరిగింది.  ఇక నాగోల్,  హైటెక్ సిటీ రూట్ లో రికార్డు సంఖ్యలో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తున్నారు.  ఆయా స్టేషన్లలో సాధారణ రోజులతో పోలిస్తే ఎంట్రీ,  ఎగ్జిట్ అయ్యే ప్రయాణికుల సంఖ్య సోమవారంనాడు రెట్టింపుగా ఉందని మెట్రో రైలు వర్గాలు తెలిపాయి.


 మెట్రో కు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆయా స్టేషన్లలో ప్రత్యేక టికెట్ కౌంటర్ ను,  అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్ధం  ప్రతి మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వ్యవధి లో  ఒక రైలు నడుపుతున్నామని చెప్పారు. మెట్రో లో  రద్దీ పెరగడంతో రైళ్లలో ఏసీ సదుపాయం అంతగా లేదని స్టేషన్లలో టాయిలెట్స్ వద్ద,  టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ తో ఇబ్బంది పాలయినట్టు ప్రయాణికులు వాపోతున్నారు. 


సాధారణ రోజుల్లో 2 . 78 లక్షలు ,  సెలవు రోజుల్లో సుమారు మూడు లక్షల మేరకు  ప్రయాణికులు మెట్రో లో ప్రయాణిస్తుంటారని  అధికారులు తెలిపారు.  అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అనూహ్యంగా రద్దీ పెరగడంతో అధికారులు ప్రయాణికుల కు తగ్గట్టుగా సౌకర్యాలను కల్పించడం లో విఫలమవుతున్నారన్న   విమర్శలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: