పలు రకాల ఇన్‌ఫెక్షన్లను వ్యాప్తి చేస్తూ భాగ్యనగర వాసులకు ప్రాణాంతకంగా మారిన పావురాలను జీహెచ్‌ఎంసీ అధికారులు అటవీ ప్రాంతాలకు తరలించారు. మొజాంజాహీ మార్కెట్ వద్ద వందలాది పావురాలను పట్టుకొని శ్రీశైలం అడవుల్లో వదిలేశారు. భాగ్యనగర చారిత్రక వారసత్వంతో పాటు కొనసాగుతూ వస్తున్న పావురాలు.. పలు రకాల వైరస్‌లను వ్యాప్తి చేస్తున్నాయి. ముఖ్యంగా వీటి వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు ప్రబలుతున్నాయి.


జంట నగరాల్లో పావురాలు, వాటితో ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందుతున్న తీరుపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పక్షి విభాగ అధిపతి డాక్టర్‌ వాసుదేవరావు బృందం మూడేళ్లుగా అధ్యయనం చేస్తోంది. మనుషులకు పావురాలు కలిగిస్తున్న నష్టం గురించి వాసుదేవరావు వివరించారు. హైదరాబాద్‌లో పావురాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.జనావాసాల మధ్యన ఉంటూ భయానక ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చేయడమే కాకుండా.. చారిత్రక కట్టడాలను కూడా పావురాలు అందవిహీనంగా మారుస్తున్నాయి. ఇలాంటి పావురాల సంఖ్యను నియంత్రించడానికి జీహెచ్‌ఎంసీ చర్యలు ప్రారంభించింది.

ఇప్పటికే నగరంలోని ఉద్యానవనాల్లో పావురాలకు ఫీడింగ్ నిషేధించింది. జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు శుక్రవారం ఉదయం బ్లాక్‌రాక్ పావురాలుగా పేర్కొనే 500 పావురాలను వలల ద్వారా పట్టుకొని అటవీ శాఖకు అప్పగించారు. నగరంలోని హెరిటేజ్ కట్టడాల పునరుద్ధరణలో భాగంగా జీహెచ్‌ఎంసీ కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మోజాంజాహి మార్కెట్ మున్సిపల్ కాంప్లెక్స్‌కు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది.


అయితే.. పునరుద్ధరణ చేసిన గుమ్మటాలపై వేలాది పావురాలు రెట్టలు వేయడంతో అంద విహీనంగా మారడం, తిరిగి వాటిని తొలగించడం జీహెచ్‌ఎంసీ అధికారులకు నిత్యకృత్యంగా మారింది. ఈ పరిస్థితిని నివారించేందుకు పావురాలను పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలే కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టింది.శుక్రవారం ఉదయం మోజాంజాహి మార్కెట్‌లో పావురాల ఫీడింగ్‌కు విక్రయిస్తున్న జొన్నలను వెటర్నరీ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పావురాల వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులకు వెంటనే సోకే ప్రమాదం ఉందని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: