సాధారణంగా సినిమాల్లో మాత్రమే సీరియల్ కిల్లర్ ఉంటారు అని  మనం ఎక్కువగా అనుకుంటాము . కానీ నిజ జీవితంలో కూడా అక్కడక్కడ సీరియల్ కిల్లర్లు ఉంటారు అనేది నిజం.ఏలూరు హనుమాన్‌ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన బంధువులు, పరిచయస్తుల్లో బాగా డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకుని.. పూజల పేరిట మాయ చేసేవాడు. ఫలానా పూజ చేయిస్తే అపర కోటీశ్వరులు కావచ్చని, ఓ రకమైన నాణేన్ని దగ్గర ఉంచుకుంటే రాజకీయ పదవులు సైతం వరిస్తాయని నమ్మించేవాడు.

పూజలు ఫలించక.. అతడిచ్చే నాణేలు పని చేయట్లేదని గుర్తించి నిలదీసిన వ్యక్తులకు ఈసారి పెద్ద గుడిలో పూజ చేయించానని చెప్పి ప్రసాదమిచ్చేవాడు. అందులో విషం కలపటంతో దాన్ని తిన్న వ్యక్తులు కొద్దిసేపటికే ప్రాణాలు విడిచినట్లు సమాచారం. క్రైం థ్రిల్లర్‌ను తలపించే రియల్‌ స్టోరీ ఇది.


సీరియల్‌ కిల్లర్‌ అసలు స్వరూపం వ్యాయామ ఉపాధ్యాయుడి  హత్యతో వెలుగు చూసింది. ఏలూరు అశోక్‌ నగర్‌లోని కేపీడీటీ పాఠశాల పీఈటీ కాటి నాగరాజు (49) ఈ నెల 16న వట్లూరులోని మేరీమాత ఆలయం వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే అతడు మరణించగా, గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు తొలుత భావించారు. ఐతే, నాగరాజు వేరే వారికి ఇచ్చేందుకు తీసుకెళ్లిన రూ.2 లక్షల నగదు, అతని ఒంటిపై గల నాలుగున్నర కాసుల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో త్రీటౌన్‌ పోలీసులకు సమాచారమిచ్చారు.


నాగరాజు మరణంతో తనకెలాంటి సంబంధం లేదని సదరు కిల్లర్‌ బుకాయించగా.. చివరకు విషం కలిపిన ప్రసాదం తినిపించి నాగరాజు ప్రాణాలు తీసినట్లు అంగీకరించాడు. అతడి ఒంటిపై గల బంగారు ఆభరణాలు, డబ్బును తానే తీసుకున్నట్టు చెప్పాడు. తానిచ్చిన విషం తిన్న బాధితులు కొంతసేపటికే మరణించే వారని, దీనివల్ల వారి కుటుంబ సభ్యులు హార్ట్‌అటాక్‌తో చనిపోయినట్లు భావించేవారని కిల్లర్‌ చెప్పాడు. ఇలా ఏలూరులో ముగ్గురితోపాటు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 8 మందిని హతమార్చి నగదు, బంగారం దోచుకున్న విషయాన్ని పోలీసులకు చెప్పాడు


మరింత సమాచారం తెలుసుకోండి: