సంపూర్ణ మద్యపాన నిషేధానికి అక్కడి వారు నడుం బిగించారు. ఓ కమిటీ వేసిన మరీ లక్ష్యం వైపు అడుగులేశారు. అది కాస్తా ఫలితాన్నిస్తూ.. కొత్త మద్యం టెండర్లు ఆయా మండలాల్లో నమోదు కాకపోవడంతో అక్కడ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. 


ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జైనూరులో ఆదివాసీలు దీపావళి అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఎందుకు అనుకుంటున్నారా..? ఆయా మండలాల్లో సంపూర్ణ మద్యపాన నిషేదం అమల్లోకి వచ్చింది. అనేక కుటుంబాలు రోడ్డున పడడానికి కారణం మద్యమే అని గ్రహించిన ఏజెన్సీలో ఉండే ఆదివాసీలు.. ఆ మహమ్మారికి దూరం కావాలనుకున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొమరం భీం జిల్లాలోని మూడు మండలాల సర్పంచులు కలసి పైసా చట్టం ప్రకారం ఐటీడీఏ పీఓ, కలెక్టరుకు మద్యపాన నిషేద తీర్మాణాన్ని అందించారు.


ఆదివాసీ ప్రజలు ఇచ్చిన తీర్మాణాన్ని వెంటనే ఆమోదించిన కలెక్టర్.. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సిఫారసు లేఖ పంపారు. దీంతో నేటి నుంచి అమలు కాబోతున్న కొత్త మద్యం పాలసీకి ఆయా మూడు మండలాల్లో టెండర్లు నిలిపివేశారు. తమ విజ్ఞప్తిని మన్నించి వెంటనే మద్యం టెండర్లను ఆపేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు ఆదివాసీలు. మూడు మండలాల్లోని ఆదివాసీలు ఓ నిర్ణయానికి కట్టుబడి ఉండడంపై అటు అధికారులతో పాటు ఇటు స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపులు లేకుండా పోతే.. గుడుంబా, సారాయి పెరిగే అవకాశం ఉందని అధికారులు భయపడుతున్నా.. వాటిని కూడా తమ ప్రాంతాల్లోకి రానివ్వకుండా చేస్తామని హామీ ఇస్తున్నారు మూడు మండలాల్లోని  సర్పంచ్‌లు. ఏది ఏమైనా.. మద్యం మహమ్మారిని పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్న నేటి కాలంలో.. మూడు మండలాల చైతన్యం రాష్ట్రానికే ఆదర్శమని చెప్పోచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: