ప్రపంచంలోని క్రియేటివ్ సిటీల జాబితాలో చేరింది భాగ్యనగరం. ప్రపంచంలోని అన్ని ర‌కాల రుచులు మన హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటాయి. ఇక్కడ రెడీ అయ్యే బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం ఇతర దేశాల్లోనూ ప్రాముఖ్యత పొందాయి. 


హైదరాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది బిర్యానీ, హలీం, ఇరానీ ఛాయ్. నగరంలో అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరూ ఈ రుచులను ఆస్వాదించి తీరాల్సిందే. లేకపోతే హైదాబాద్ కు వచ్చినా ప్రయోజనం లేదనే భావన కలుగుతుంది. ఎందుకంటే వాటి టేస్ట్ అలా ఉంటుంది మరి. మన తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశ విదేశాలకు హైదరాబాద్ వంటల టేస్ట్ పాకిపోయింది. అదే ఇపుడు అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. 


దేశ‌, విదేశాల‌కు చెందిన అనుభ‌వ‌జ్ఞులైన చెఫ్‌ల‌ను నిజాం న‌వాబులు హైద‌రాబాద్‌కు ర‌ప్పించారు. కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలతో పాటు సౌదీ అరేబియా, ఆఫ్రికా, అమెరికా, చైనా దేశాల ఫుడ్ వెరైటీస్ ఇక్కడి ప్రజలకు పరిచయం చేశారు. అందుకే భాగ్య నగరంలో అన్ని రకాల వెరైటీలు కనిపిస్తూ జిహ్వ చాపల్యాన్ని తీరుస్తుంటాయి.  


భిన్న వర్గాలు, విభిన్న మతాలకు నెలవైన రాజధాని నగరంలో అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తూ.. ఎంతో కాలంగా మినీ ఇండియా అయిపోయింది. దీంతో అన్ని రాష్ట్రాలకు చెందిన స్వీట్లు, ఆహారపు అలవాట్లు నగరంలో సాధారణం అయిపోయాయి. అటువంటి ఆహార సంప్రదాయాలనే గుర్తించింది యునెస్కో. దేశవిదేశాలకు చెందిన అన్ని రకాల ఆహార పదార్ధాలు దొరికే ఏకైక నగరంగా హైదరాబాద్‌ను గుర్తించింది యునెస్కో. క్రియేటివ్‌ సిటీల జాబితాలో చేరుస్తూ.. సర్టిఫై చేసింది. దీంతో పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ నగర ప్రజలు. ఈ గుర్తింపుతో హైదరాబాద్‌ మహానగరం కీర్తి కిరీటంలో మరో కలికుతురాయి వచ్చి చేరినట్లైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: