ప్రస్తుత కాలం మనిషి ఒకప్పటి కాలంతో పోలిస్తే ఎన్నోరకాల నూతన ఆవిష్కరణలతో ఎంతో సుఖంగా మరియు సంతోషంగా జీవిస్తున్నాడు అనే చెప్పాలి. అయితే ఈ నూతన విధానాలు మరియు పద్దతుల వల్ల మనిషి మేధోశక్తి ఎన్నో రెట్లు గొప్పగా ముందుకుపోతోందని ఓవైపు మనందరం గొప్పగా చెప్పుకున్నప్పటికీ, కూడా మరొకవైపు రోజులు గడిచే కొద్దీ అదే మేధో శక్తిని మరికొందరు నిర్వీర్యం చేసుకుని తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. నిజానికి ప్రస్తుత సమాజంలో సిగరెట్, మందు, డ్రగ్స్ వంటి వాటికి యువత కొందరు ఆకర్షితులవుతూ తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని పలువురు పెద్దలు మరియు డాక్టర్లు చెప్తున్నప్పటికీ, వాటి కంటే అత్యంత ప్రమాదకరమైన ఒక జబ్బు మనలో ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుందనేది మాత్రం మరుస్తున్నారట. దాని వలన ఆ ఒక్క వ్యక్తికే కాదు అవతలి వ్యక్తులకు కూడా ఎంతో చెడు జరగడంతో పాటు, వారి జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. 

అదే అనుమానం జబ్బు అని అంటున్నారు మానసిక నిపుణులు. నేటికాలంలో ఎన్నో కాపురాలు ఈ జబ్బువల్లనే కూలుతున్నాయని కొందరు మానసిక నిపుణులు బహిరంగంగానే చెప్తున్నారు. ఇది ఒకరకమైన డేంజరస్ వ్యాధి అని, నిజానికి పూర్తి అభూత కల్పనగా చెప్పబడే ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తికి, తనతో పాటు తన ప్రక్కన వున్న వారిపై కూడా రోజురోజుకు లేనిపోని చిన్న విషయాలకు కూడా ఎంతో అనుమానం ఏర్పడి, చివరకు తనతో పాటు ఆ అనుమాన పడ్డ వారి విలువైన జీవితాలు కూడా నాశనం చేస్తున్నారని అంటున్నారు. అయితే ముందుగా భార్య భర్తల బంధం లేదా ఏదైనా మరొక చక్కటి బంధం ఏర్పడినపుడు, అవతలి వారి విషయమై మనం ఎంతో పాజిటివ్ గా ఉండాలని, అలానే అవతలి వ్యక్తులు కూడా మనవంటి వారే, వారికి కూడా ప్రత్యేకంగా జీవితం, ఆలోచనలు, వ్యక్తిగత అభిప్రాయాలు అనేవి వుంటాయనే విషయం ఎప్పటికీ మరువకూడదని చెప్తున్నారు. అయితే ఈ అనుమానం జబ్బు ప్రవేశించిన వ్యక్తి, స్త్రీ అయిన పురుషుడు అయినా, 

తనతో పాటు తన తోటివారిపై అనవసరమైన విషయాలపై కూడా విపరీతంగా అనుమానపడుతూ, మనసు ఎంతో కకావికలం చేసుకుని, ఏ పనిపై కూడా పూర్తిగా శ్రద్ధ పెట్టలేక, చివరికి తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారని అంటున్నారు. కాబట్టి ముందుగా మనం ఏర్పరుచుకునే ఏ బంధానికైనా నమ్మకం అనేది పునాది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, అయితే సమాజంలో అక్కడక్కడా తమను నమ్మిన వారిని మోసం చేసి చెడుగా ప్రవర్తించిన ఘటనలు జరుగుతున్న మాట వాస్తవమేనని అయితే, ఆ కొద్దిపాటి ఘటనలను పట్టుకుని అన్నీ తెలిసిన మనం కూడా మనవారిపై అనుమానపడడం ఎంతవరకు సమంజసమో ఎవరికి వారు ఒకసారి మనసులో ఆలోచన చేసుకుంటే రాబోయే రోజుల్లో మన సమాజంలో తప్పకుండా మంచి మార్పులు చోటుచేసుకుంటాయని అంటున్నారు నిపుణులు. కాబట్టి అనుమానం అనే పెనుభూతాన్ని రూపుమాపుదాం, అందరం ఒకరినొకరు అర్ధం చేసుకుని హాయిగా జీవిద్దాం...!!


మరింత సమాచారం తెలుసుకోండి: