సాధార‌ణంగా చాలా మంచి దంపతులు పెళ్లైన కొంతకాలం వరకు తమ మధ్యలోకి పిల్లలు రాకుండా ఉంటే బాగుండని కోరుకుంటారు. మరి కొందరు పెళ్లి కాగానే ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులు తెలియక వెంటనే పిల్లలను కంటుంటారు. చాలామంది మహిళలు ఉద్యోగాలతో బిజీగా ఉండటం వలన పిల్లలు కనాలి అనే విషయాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. లైఫ్‌లో సెటిల్ అయ్యాక‌ తీరిగ్గా పిల్ల‌ల్ని క‌న‌వ‌చ్చులే అని అనుకుంటారు. అయితే పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత‌ పిల్లలు కావాలని అనిపిస్తుంది. కానీ ఎంత ప్రయత్నించినా పిల్ల‌లు మాత్రం క‌ల‌గ‌రు.


వాస్త‌వానికి ఏ వయసులోపు కనాలి అనే విషయంపై చాలా మంది దంపతుల్లో క్లారిటీ ఉండదు. ఇప్పుడే ఏం తొందర వచ్చిందిలే అని అనుకుంటారు. కానీ స్త్రీల గర్భదారణకు అనువైన వయసు 24ఏళ్ల నుంచి 30ఏళ్లు అని వైద్యులు చెబుతున్నారు. 35ఏళ్ల వరకు గర్భం దాల్చే అవకాశం ఉన్నప్పటికీ... 30వ సంవత్సరంలో పెళ్లైతే ఆరు నెలలలోపే గర్భం దాల్చే ప్రయ‌త్నం చేయాలి. ఎందుకూ అంటే మహిళలు 30 ఏళ్ళ వయస్సు తర్వాత పిల్లలను కనాలి అనుకున్నా అండ ఉత్పత్తి క్షీణించడం, హార్మోన్లలో మార్పుల వ‌ల్ల భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


అలాగే మ‌గ‌వారిలోనూ ఒక వ్యక్తి 30 ఏళ్ళ వయస్సు దాటాడంటే, అతని టెస్టోస్టిరాన్ స్థాయిలు ఏడాదికి 1% చొప్పున తగ్గుతూ పోతాయి. వీర్యకణాల ఉత్పత్తిపై కూడా ప్రభావం ఉంటుంది. దీంతో మగవారిలోనూ వీర్యం నాణ్యత తగ్గిపోతూ వస్తుంది. అందుకే 28-30 ఏళ్ళ మధ్య వయస్సు ఒక వ్యక్తి తండ్రవటానికి మంచి స‌మ‌యం అని వైద్య నిపుణులు అంటున్నారు. అదే విధంగా సరైన వయస్సులో పెళ్లి చేసుకుని, ఆ వయస్సు ప్రకారమే పిల్లలను ప్లాన్ చేసుకుంటే ఆరోగ్యమైన బిడ్డలు పుడతార‌ని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: