'మేమిద్దరం... మాకిద్దరు' అన్న చందంగా పరిమిత కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. కొన్ని కుటుంబాలైతే చైనా తరహాలో 'మేమిద్దరం... మాకొక్కరే చాలు' అంటున్నారు. కుటుంబ నియంత్రణ పాటించడం, ఉద్యోగాలు, ఉపాధి కోసం వలసలు అధికం కావడం చిన్న కుటుంబాల సంఖ్య పెరుగుదలకు ప్రధాన కారణం. రోజురోజుకీ పెరుగుతున్న జనాభాతో వర్ధమాన దేశాలు సతమతమవుతున్నాయి. జననాలు బాగా తగ్గి స్పెయిన్ దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జననాల సంఖ్య తగ్గించేందుకు మన దేశంలో ప్రభుత్వం అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటే, స్పెయిన్ దానికి విరుద్ధంగా పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. 

 

ఎక్కువమంది పిల్లల్ని భరించే శక్తిలేదని మన దేశం వాపోతోంటే, పిల్లల సంఖ్య తగ్గిపోయిందని స్పెయిన్ దేశం ఆవేదన చెందుతోంది. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. కుటుంబ నియంత్రణకు ఇప్పటివరకు ఉన్న ఒకే ఒక్క మార్గం 'ఆపరేషన్' మాత్రమే. ఇందు కోసం భార్య కాకుండా భర్త ముందుకు వస్తే వారికి వేసెక్టమీ ఆపరేషన్ చేసేవారు. కానీ ఇక‌పై కుటుంబ నియంత్రణ కోసం పురుషులు ఆపరేషన్ అవసరం లేకుండానే సంతానోత్పత్తిని అరికట్టే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రపంచంలోనే తొలిసారిగా ఒక ఇంజెక్షన్‌ సిద్ధమైంది. 

 

ఈ మందును భారత వైద్య పరిశోధన మండలి.. ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు. రివర్సిబుల్  ఇన్ హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్  (ఆర్ఐఎస్యూజీ) అని ఈ ఇంజెక్షన్ కు పేరు పెట్టారు. అలాగే విజయవంతంగా క్లినికల్‌ పరీక్షలు కూడా నిర్వహించారు. దీన్ని ఆమోదం కోసం డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ కు పంపారు. మ‌రియు  ఈ ఇంజెక్షన్ తో 13 ఏళ్ల పాటు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యానికి అడ్డుకట్ట వేయొచ్చు. కాగా, ఈ ఇంజెక్షన్ విజయాల రేటు 97.3 శాతంగా ఉందని, దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని పరిశోధకులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: