సాధారణంగానే బస్సు, రైలు వంటి ప్రయాణాలు కొందరికి అస్సలు పడవు. అటువంటి వారికి ప్రయాణ సమయంలో వాంతులు కావడం, తల తిరగడం, వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలా చాలామందికి వాహనాల ప్రయాణం సమయంలో వాంతులు అవుతుంటాయి. అయితే ఇలాంటి ప్ర‌యాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు లవంగాలు, సోంపు లాంటివి దవడన‌ పెట్టుకుని చప్పరిస్తే వాంతులు కాకుండా ఉంటాయి. వాంతికి వ‌చ్చే సెన్సేష‌న్ కూడా త‌గ్గుతుంది.

 

ప్రయాణానికి ముందుగానీ, ప్రయాణ సమయంలోగానీ రెస్టారెంట్లూ, రోడ్‌సైడ్‌ ఆహార పదార్థాలను తినొద్దు. అవి పొట్టలో ఇన్‌ఫెక్షన్‌కి కారణమవుతాయి. అందుకే సాధ్యమైనంత వరకూ ఇంట్లోనే తిని బయలుదేరడానికి ప్రాధాన్యమివ్వాలి. అలాగే  చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం తగ్గుతుంది. అల్లంలో ఉండే క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటివి మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు. ఇవి వాంతులు, వికారం స‌మ‌స్య‌ల‌ను తగ్గిస్తాయి.

 

అదే విధంగా,  బ‌స్సులు, కార్ల‌లో ప్ర‌యాణించిన‌ప్పుడు ముందు సీట్ల‌లో కూర్చుని దృష్టిని ఎదురుగా నిల‌పాలి. దీంతో వాంతి వ‌చ్చే అవ‌కాశం త‌గ్గుతుంది. నిమ్మకాయను కొద్దికొద్దిగా నలుపుతూ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీలిస్తే కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ప్రయాణం ప్రారంభం కాగానే పిప్పర్‌మెంట్లు, ఉసిరి, నిమ్మ రుచిగల క్యాండీలూ, నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే బాగుంటుంది. తద్వారా వాంతులు, వికారం దరిచేరదు.

మరింత సమాచారం తెలుసుకోండి: