ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరు ఫిట్ నెస్ పై చాలా శ్రద్ద పెడుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గడానికి ఎన్నో రకాల మార్గాలను అనుసరిస్తున్నారు. ఏవి పడితే అవి డైట్ లో తీసుకోవటం వలన శరీరంలో సైడ్  ఎఫెక్ట్స్ ఎదుర్కుంటున్నారు. టాబ్లెట్స్ వేసుకుంటే బరువు తగ్గుతారని యాడ్స్ లో చెప్పడంతో వాటి గురించి కనుక్కోకుండానే వాడేస్తున్నారు కొందరు.   కానీ సహజ పద్ధతుల్లో బరువు తగ్గడమే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఓవైపు బరువు తగ్గుతూనే, మరోవైపు నీరసం రాకుండా... ఫిట్‌ గా ఉండేలా జాగ్రత్త పడాలి. అలాంటి అవకాశం ఇచ్చే ఆహార పదార్థాల్ని "వెయిట్ లాస్ ఫ్రెండ్లీ డైట్" అని పిలుస్తున్నారు. సహజంగా గ్రీన్ టీ, హెర్బల్ టీలు... అధిక బరువు తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. ఐతే... రోజూ వాటినే తాగాలంటే ఆసక్తి ఉండకపోవచ్చు. అందువల్ల మీకు మంచి రుచికరమైన టీ ఒకటి సూచిస్తున్నారు డాక్టర్లు. అదే "యాపిల్-అల్లం టీ. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడంలో ఇది బాగా పనిచేస్తోంది. ఇది చక్కటి ఫ్లేవర్ మాత్రమే కాదు... ఈ రుచికరమైన టీ తాగితే ఆ ఫీలింగే వేరు.

 

ఈ టీ తయారీకి పాలతో పనిలేదు. కానీ బరువు తగ్గించే రెండు పదార్థాలు ఇందులో ఉంటాయి. ఒకటి యాపిల్. ఇందులో కేలరీలు చాలా తక్కువ, ఫైబర్ ఎక్కువ. అందువల్ల ఇది బరువును తగ్గించడమే కాదు... ఆకలిని తగ్గించి... ఎక్కువ తినకుండా చేస్తుంది. యాపిల్ మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కూడా. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. శరీరంలోని వ్యర్థాలు, విషాలను బయటకు పంపించేస్తుంది. అందువల్ల యాపిల్-అల్లం టీ చాలా మంచిది.

 

అల్లంలోని యాంటీఆక్సిడెంట్స్‌కి తోడు... షోగాల్స్, జింజెరాల్స్ వంటివి కొవ్వును వేగంగా కరిగించేస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. అంతేకాదు ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి అల్లం ఎంతో మేలు చేస్తుంది.

 

మొదటగా యాపిల్ తొక్క తీసి... చిన్న చిన్న ముక్కలుగా కొయ్యండి. తర్వాత చిన్న అల్లం ముక్క, తొక్క తీసి, మిక్సీలో వెయ్యండి లేదా చితక్కొట్టండి. ఆపై మూడు కప్పుల నీటిలో యాపిల్ ముక్కలు, చితక్కొట్టిన అల్లం ముద్దను వేసి ఉడకబెట్టండి. 10 నుంచీ 12 నిమిషాలు అవి ఉడకాలి. ఆ సమయంలో... యాపిల్, అల్లం పూర్తిగా నీటిలో మునిగి ఉండేలా చెయ్యాలి. తదుపరి స్టౌ ఆపేసి... ఆ నీటిని చల్లబడేలా కొన్ని నిమిషాలపాటూ పక్కన పెట్టాలి. ఇప్పుడు ఆ నీటిని మిక్సీలో లేదా బ్లెండర్‌లో వేసి... స్మూత్ జ్యూస్‌లా అయ్యేవరకూ గ్రైండ్ చెయ్యాలి. ఇలా చేస్తే...యాపిల్-అల్లం టీ రెడీ. కాస్త వేడిగా ఉన్నప్పుడే ఈ టీని తాగేయవచ్చు. ఉదయం ఏమీ తినకముందే, ఈ టీ తాగితే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. త్వరగా అధిక బరువును తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: