తాబేలు ఏంటి, పుట్టింటికి వెళ్ళడం ఏమిటి అందులోనూ మగ తాబేలు పుట్టింటికి వెళ్ళడమా అంటూ ఆలోచన చేస్తున్నారా...అవును మీరు విన్నది నిజమే తాబేలు పుట్టింటికి వెళ్తోంది అది కూడా మగ తాబేలు. ఇంకా అర్థం కాలేదు కదా,  సరే అసలు విషయం ఏమిటంటే..అంతరించిపోతున్న తమ జాతిని కాపాడుకోవడానికి ఓ మగ తాబేలు తన ప్రాంతం నుంచీ మరొక ప్రాంతానికి వెళ్లి అక్కడ సంతతిని వృద్ది చేసి సుమారు 60 ఏళ్ళ తరువాత ఇప్పుడు మళ్ళీ తన సొంత ప్రాంతానికి వెళ్తోంది. మరింతగా అర్థమవ్వాలంటే పూర్తి వివరాలలోకి వెళ్ళాల్సిందే...

 

ఆ తాబేలు పేరు డిగో. దాని వయసు సుమారు 100ఏళ్ళు. ఈక్వెడార్ లోని గాలపాగోస్ దేవుల్లో ఉన్న ఓ ప్రాంతం దాని స్వస్థలం. పూర్వం ఈ తాబేళ్లు పూర్తిగా అంతరించి పోయే స్థాయికి వెళ్ళిపోయాయి. సుమారు 50 ఏళ్ళ క్రితం వీటి సంఖ్య కేవలం 14 మాత్రమే ఉండేవట. అందులో కూడా మగవి రెండు, ఆడవి 12 ఉండేవని దాంతో ఈ జాతిని బ్రతికించుకోక పొతే అరుదైన ఈ జాతి అంతరించిపోతుందని వీటిని వృద్ది చేసేందుకు అమెరికా శాస్త్రవేత్తలు ఓ భారీ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు.

 

ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 14 మగ తాబేళ్లని పట్టుకుని వాటిని కాలిఫోర్నియాలో లోని  జూ కి తరలించారు. ఈ తాబేళ్ళలో డిగో కూడా ఒకటి. శాస్త్రవేత్తలు అనుకున్న దానికంటే కూడా ఆనతి కాలంలోనే వీటి వృద్ది అమాంతం పెరిగిపోయింది. సుమారు రెండు వేల తాబేళ్లు పుట్టగా వాటిలో 800 వందల పిల్లలకి  డిగో నే తండ్రి కావడం విశేషం. తాజాగా ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడంతో ఇప్పుడు డిగో ని దాని స్వస్థలం అంటే పుట్టింటికి పంపుతున్నారు. శాస్త్రవేత్తలు దగ్గరుండి మరీ దానిని ఎస్పానోలా దీవుల్లో వదలనున్నారు. ఇప్పుడు అక్కడ 1800 ల తాబేళ్లు ఉన్నాయి. ఈ సంతతి ఇంతగా అభివృద్ధి చెందిందంటే డానికి కారణం డిగోనే అంటున్నారు శాస్త్రవేత్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి: