సంక్రాంతి అంటే మార్పు అని అర్థం. అంతేకాకుండా సంక్రాంతి అనగా మారడం, చేరడం అనే ద్వంద్వార్థాలు కూడా వస్తాయి. కాల గమనం ప్రకారం చూసుకుంటే సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి అంటారు. రైతులు తమ చెమటను చిందించి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి దీన్ని రైతుల పండుగగా చెబుతారు.

 

అందుకే మనకి సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది పల్లె వాతావరణం, పాడి పంటలు, వివిధ పనులపై గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్లిన వారంతా సంక్రాంతి పండుగగా గ్రామాలు చేరుకునే ఒక ఆనందకరమైన వాతావరణం. మకర సంక్రాంతి అయిన  రోజుని పండుగ రోజుగా చెబుతారు. రోజు కూడా ఇంటి ఎదుట రంగు రంగులతో పోటా పోటీగా ముగ్గులు వేస్తారు. వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటిచుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతుంటారు. పలు పిండి వంటలు చేసి సూర్యదేవుడికి ప్రసాదంగా సమర్పిస్తుంటారు.

 

భారతీయ పండుగలన్నీ ప్రకృతితో ముడి పడి ఉంటాయి. ప్రకృతిని, కాలగమనాన్ని ఆచరిస్తాయి. అందులో సంక్రాంతి పండుగ అత్యంత విశిష్టమైనది. మిగిలిన పండుగలన్నీ చాంద్రమానాన్ని అనుసరించి వస్తే, సంక్రాంతి మాత్రం సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది.

 

పైగా, ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర సంక్రమణంతో సంక్రాంతి వెలుగులు ఇంటింటా ప్రసరిస్తాయి. ఆదిశంకరాచార్యుడు ఇదే రోజున సన్యాసం పుచ్చుకున్నాడని చెబుతారు. పవిత్ర ధనుర్మాస వ్రతానికి ముగింపు పలికేది కూడా సంక్రాంతి రోజునే. రోజున గోదా కళ్యాణం చేసి వ్రతాన్ని పరిసమాప్తి చేస్తారు. ఎన్నో విశిష్టతలు ఉన్నాయి కాబట్టే పండుగను పెద్ద పండుగ అని గర్వంగా చెప్పుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: