ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక  కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య హైదరాబాద్ నగరం లో రోజు , రోజుకి పెరుగుతుండడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది . దానికి తోడు సోషల్ మీడియా లో కరోనా వైరస్ గురించి  జరుగుతున్న విపరీత ప్రచారం వల్ల కూడా హైదరాబాద్ వాసులు బెంబేలెత్తిపోతున్నారు . గాంధీ ఆసుపత్రి లో వందల సంఖ్యలో కరోనా వైరస్ అనుమానితులు చేరారంటూ కొంతమంది పనిగట్టుకుని విష ప్రచారం చేస్తుండడంతో సామాన్యులు అయోమయానికి గురవుతున్నారు . అయితే ఇప్పటి వరకూ హైదరాబాద్ లో 15 కరోనా వైరస్ అనుమానిత  కేసులు నమోదయ్యాయి .

 

ఇందులో  గాంధీ ఆసుపత్రి లో ఇద్దరు , ఫీవర్ ఆసుపత్రి లో నల్గురు కరోనా వైరస్ అనుమానితులుగా  చేరారు . 15 మంది రక్త నమూనాలను సేకరించి పూణే కు వ్యాధి నిర్ధారణ కోసం పంపించగా , ఇప్పటికే వారిలో  తొమ్మిది మంది నెగిటివ్ అని వచ్చినట్లు వైద్యులు తెలిపారు . ఇక మరో ఇద్దరి వైద్య నివేదికలు అందాల్సి ఉందని చెప్పారు . వారివి కూడా నెగిటివ్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు . దేశం లోనే తొలి కరోనా వైరస్ కేసు కేరళ లో నమోదయిన విషయం తెల్సిందే . దీనితో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది . కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించారు .

 

ఇప్పటికే వ్యాధి నిర్ధారణ కిట్స్ నగరానికి చేరుకోవడం తో , ఇక ఇక్కడే వ్యాధి నిర్ధారణ చేసే అవకాశముందని వైద్యులు తెలిపారు . అయితే ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ అనుమానిత కేసులు నమోదయినప్పటికీ , ఏ ఒక్కరికి  వైరస్ సోకిన దాఖలాలు లేకపోవడం తో ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి . అయితే అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు రెండు రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వెల్లడించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: