ఆయ‌న పేరు ప్రసాద్‌. హైద‌రాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. జీవితం చక్క‌గా సాగుతోంది. అయితే,  కొంతకాలంగా ఒంటి నొప్పులతో బాధపడుతున్న ప్రసాద్‌కు ఒకరోజు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది. కార్డియాలజిస్ట్‌ను సంప్రదించగా యాంజియోగ్రామ్‌ తీసి గుండె సంబంధ సమస్యలేవీ లేవని తేల్చారు. అనంత‌రం మ‌రిన్ని ప‌రీక్ష‌లు చేయ‌గా...అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఆయ‌న త‌న సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానివేశాడు. 

 


ప్ర‌సాద్‌కు చేసిన వివిధ ప‌రీక్ష‌ల్లో విటమిన్‌ డీ లోపం వల్లనే ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయ‌ని డాక్టర్‌ గుర్తించారు. డీ విటమిన్‌ మాత్రలు వేసుకుంటూ.. రోజూ శరీరానికి కొంతసేపు సూర్యరశ్మి సోకేలా చూసుకోవాలని సూచించారు. ఏసీ కారులో ఆఫీసుకు వెళ్లి ఏసీ గదుల్లో పనిచేస్తుండటంతో సూర్యరశ్మి ఒంటికి తగలడంలేదని గ్రహించిన ఆయన కొంతకాలం ఆ ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నారు. ఇది నిజంగా జ‌రిగిన ఘ‌ట‌న‌. మ‌రో సంఘ‌ట‌న‌లో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ దవాఖానలో పనిచేస్తున్న సుమారు 250 మంది వైద్యుల్లో 99 శాతం మంది డీ విటమిన్‌ లోపంతో బాధపడున్నట్టు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కారణాలు గ్రహించి శరీరానికి సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్త పడుతున్నారు.

 


కార్పొరేట్‌ స్కూళ్ల విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, డాక్టర్లు, గృహిణులు డీ విటమిన్‌ పొందలేక వివిధ వ్యాధులకు గురవుతున్నారు. విటమిన్‌ డీ లోపిస్తే ఒంటినొప్పులు, కీళ్లు, కండరాలు, ఎముకల నొప్పులు, తీవ్ర అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్నపిల్లల్లో రికెట్స్‌వ్యాధి వస్తుంది. అది దొడ్డికాళ్లకు దారితీసి ఎముకల సాంద్రత తగ్గిస్తుంది. ఏ చిన్న దెబ్బతగిలినా ఎముకలు విరుగుతాయి. పెద్దవారిలో ‘ఆస్టియో మలేషియా’ వ్యాధి వస్తుంది. స్క్రీజోఫీనియా, యాంగ్జయిటీ, డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. గర్భిణులకు విటమిన్‌ డీ లోపిస్తే గర్భంలోని శిశువు పెరుగుదల తగ్గుతుంది. పుట్టిన పిల్లలకు ఎముకల వ్యాధులతోపాటు ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు, గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వృద్ధుల్లో కండరాల పటుత్వం తగ్గుతుంది. తరచూ కింద పడిపోతుంటారు. ఎముకలు చిన్నపాటి దెబ్బలకే విరిగిపోతుంటాయి. మన దేశంలో 85శాతం మంది డీ విటమిన్‌లోపంతో బాధపడుతుండగా.. ఢిల్లీలో ఏకంగా 90 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు ఓ సర్వేలో వెల్లడయింది. హైదరాబాద్‌లోనూ 85శాతం మందిని ఈ సమస్య పీడిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: