ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రోజువారీ అవసరాలకు ద్విచక్రవాహనం తప్పనిసరిగా మారింది. అదే స‌మ‌యంలో వాహ‌నాల దొంగ‌త‌నం సైతం పెరిగిపోతోంది. తేలికగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారి తొక్కిన యువకులు వాహనాల చోరీలకు పాల్పడుతూ జల్సాలు చేస్తున్నారు. మరికొన్ని ముఠాలు విడిభాగాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాయి. కొత్తగా వచ్చే కార్లకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. కానీ..బైక్‌ల‌కు అలాంటి స‌దుపాయం లేక‌పోవ‌డంతో... సుల‌భంగా అవి దొంగ‌ల పాల‌వుతున్నాయనే బాధ‌ చాలా మందిలో ఉంది. అయితే, కొత్త‌గా వ‌చ్చిన టెక్నాల‌జీ ద్వారా అలాంటి స‌మ‌స్యే ఉండ‌దంటున్నారు.

 


రూ.500 నుంచి రూ.10,000 వ‌ర‌కు అందుబాటు ధ‌ర‌ల్లోనే ఉన్న వివిధ ప‌రికరాల‌తో...ద్విచక్ర వాహనాలకు  భద్రత క‌ల్పించుకోవ‌చ్చున‌ని నిపుణులు చెప్తున్నారు. యాంటీ- థెఫ్ట్‌ అలారంతో సమస్య నుంచి గట్టెక్కవచ్చు.  ఎవరైనా వాహనాన్ని కదిలించినా, తాళం తీసేందుకు ప్రయత్నించినా శబ్దం వస్తుంది. రిమోట్‌లో ఉన్న అన్‌లాక్‌ బటన్‌ను ప్రెస్‌ చేస్తే ఆ శబ్దం ఆగిపోతుంది. వాహనం వంద మీటర్ల దూరంలో ఉన్నా...ఇంజిన్‌ను ఆఫ్‌, ఆన్‌ చేయవచ్చు. దొంగలు ఎవరైనా ఆకస్మాత్తుగా వాహనాన్ని తీసుకెళ్తె లాక్‌ బటన్‌ ప్రెస్‌ చేస్తే, ఆటోమెటిక్‌గా ఇంజిన్‌ ఆగిపోతుంది. ఏయే ప్రాంతాల్లో పర్యటించాం? ఎంత వేగం? పార్కింగ్‌ చేసిన ప్రాంతాలు తెలుసుకోవచ్చు. ఎవరైనా పొరపాటున వాహనాన్ని చోరీ చేస్తే జీపీఎస్‌ సహాయంతో ఎక్కడ ఉందో గుర్తించవచ్చు. డిసెబుల్‌ బటన్‌ అనే ఆప్షన్‌ ద్వారా ఇంజిన్‌ను ఆపేసేందుకు వెసులుబాటూ ఉంది. అలా ఒక్కసారి ఇంజిన్‌ను ఆఫ్‌ చేస్తే వాహనం అక్కడే నిలిచిపోతుంది. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా వాహనం ఉన్న ప్రాంతానికి చేరుకోవచ్చు. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ సిమ్‌ను వినియోగిస్తారు. 

 


బైక్‌ల‌కు సంబంధించి జీపీఎస్‌, సెక్యూరిటీ లాక్‌ లాంటి పరికరాలను ఏర్పాటు చేస్తే...వాటి పనితీరు, నియంత్రణ కోసం తప్పనిసరిగా చరవాణిలో యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్‌ల సహాయంతో పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం నగరంలో ఎక్కువగా ఉద్యోగులు ఉపయోగించుకుంటున్నారు. ఇంత‌కీ ఇవి ఎక్క‌డ దొరుకుతాయి అంటారా? కొత్తగా అందుబాటులోకి వచ్చిన అలారం, తాళాలు, జీపీఎస్‌ ట్రాకర్స్‌.. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు, ఆటోమొబైల్‌ దుకాణాల్లో రూ.550-10,000 ధరల్లో లభిస్తున్నాయి. అందుకే, వీటిని మీ వాహ‌నానికి అనుసంధానం చేయండి... మీ వాహ‌నం గురించి టెన్ష‌న్ లేకుండా... రిలాక్స్‌గా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: