భార్యభర్తల బంధం ఏడేడు జన్మలదంటారు. భార్యభర్తల బంధం కలకాలం హాయిగా సాగిపోవాలని అందరూ కోరుకుంటారు. ఎవరైనా సరే కలిసి జీవించాలనే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. అయితే పవిత్ర కుటుంబ జీవనానికి పునాది వివాహం. మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా.. అంటూ పురుషుడు అగ్నిసాక్షిగా స్త్రీ మెడలో మాంగల్యధారణ చేసి పవిత్ర వైవాహిక జీవితానికి నాంది పలుకుతాడు. ‘ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచః నాతి చరామి’ అంటూ ధర్మార్థ కామ మోక్ష సాధనలో, జీవితాంతం ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా నా అర్థాంగి చేయి విడువను అంటూ ప్రాణిగ్రహణం చేసి పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తాడు.

 

అగ్నిచుట్టూ ఏడడుగులు వేసి దాంపత్య జీవితానికి నాంది పలుకుతాడు. ఇలా పవిత్రమైన వేద మంత్రాల సాక్షిగా ఇద్దరూ ఒక్కటై, ఆ క్షణంనుండి ఇద్దరూ మృత్యువు వరకు కలిసే న‌డుస్తాము అన్న‌ట్టుండేవి.. నాటి వైవాహిక బంధాలు. కానీ, అటువంటి వైవాహిక జీవితం క్రమంగా బీటలువారుతోంద‌ని నేటి స‌మాజం చూస్తేనే అర్థం చేసుకోవ‌చ్చు. ప్రతి చిన్న విషయానికి అపార్థాలు, అలకలు, కోపాలు పెరిగి దాంపత్యంలో ప్రేమభావన, ఆత్మీయత తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి సమాజంలో అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తోంది.

 

నేటి యువతరం భావాలలో పెను మార్పులు వస్తుండటంతో ప్రేమ పెళ్లిళ్లలోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాలతో భార్యాభర్తలైన వారి మధ్య కూడా వివాదాలు పెరిగిపోతూ విడాకుల‌కు దారితీస్తోంది. వాస్త‌వానికి నేటి యువతరం తమ వైవాహిక జీవనం పట్ల పరస్పర అవగాహన లోపించడం వల్లే ఈతరహా వివాదాలు పెరిగి చివరకి విషాదాంతాలుగా మిగిలిపోతున్నాయి. అలాగే భార్త‌భ‌ర్త‌ల మ‌ధ్య ఏజ్ గ్యాప్ వ‌ల్ల మ‌న‌స్సులు సెట్ కాక అనేక స‌మ‌స్య‌లకు దారితీస్తున్నాయి. అస‌లు దాంపత్యం అనేది భార్యభర్తలు ఇద్దరూ కలిసి చేయాల్సింది. అంటే ఈ బంధంలో ఇద్దరూ సమానులే. అయితే ఒకరిపై మరొకరు చేసే ఆధిపత్యం విడాకులకు మొదటి మెట్టు అవుతుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: