భార్య భ‌ర్త‌ను ఓ కోరిక కోరింది.. ఎదిరింటావిడ క‌ట్టుకున్న‌ కొత్తచీరను కొనిపెట్ట‌మ‌నో.. ప‌క్కింటావిడ పెట్టుకున్న‌ న‌గ‌లను త‌న‌కూ తెచ్చిపెట్ట‌మ‌నో కాదండోయ్‌.. చివ‌రికి ఇంటిముందున్న జామ‌చెట్టుకు కాచిన దోర‌ పండును తెచ్చివ్వ‌మ‌న్న‌దా.. అంటే అంత‌క‌న్నా కాదుబాబోయ్‌..! ఇంత‌కీ ఆమె కోరిన కోరిక ఏమిటి..?  దానిని ఆమె భ‌ర్త ఎలా తీర్చాడు..? అని ఆలోచిస్తున్నారా..?  నిజంగా ఆ విష‌యం తెలిస్తే మాత్రం మీరు షాక్‌కు గ‌రికావ‌డం ఖాయం.. ఎందుకంటే.. అలాంటి కోరికను దాదాపు ఏ భార్య కూడా కోర‌దు.. ఒక‌వేళ కోరినా కూడా తీర్చేందుకు భ‌ర్త‌ సాహ‌సించ‌డు. కొండ‌మీది కోతినైనా తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తాడేమోగానీ.. ఇలాంటి ప‌నికిమాలిన ప‌నిని మాత్రం చేసేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డు. కానీ.. ఇక్క‌డ మాత్రం ఆమె కోరింది.. అత‌ను తెచ్చి ఇచ్చాడు. ఇక ఆ వివ‌రాల్లోకి సుత్తిలేకుండా సూటిగా వెళ్దాం.

 

తెలంగాణలోని పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని మండ‌లం ఖ‌మ్మంప‌ల్లి గ్రామానికి చెందిన ఏటా ర‌వి మాజీ మావోయిస్టు. ద‌ళంలో ఉన్న‌ప్పుడే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆమెకు ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు. ఆ త‌ర్వాత 1999లో స్వ‌ప్న అనే యువ‌తిని రెండో పెళ్లి చేసుకున్నాడు. చాలా ఏళ్లు అయినా ఆమెకు సంతానం క‌ల‌గ‌లేదు. అయితే.. ఒక మ‌గ‌బిడ్డ కావాల‌ని అనుకున్నారు. ఎలాగైనా కావాల‌ని స్వ‌ప్న భ‌ర్త‌ను కోరింది. అయితే.. ర‌వి పాట‌లు పాడుతూ ఉండేవాడు. ఈ క్ర‌మంలో పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గిరి మండ‌లం సెంటిన‌రీ కాల‌నీకి చెందిన మేక‌ల నిఖిల్ ప‌రిచ‌యం అయ్యాడు. నిఖిల్ అక్క‌కు మూడో సంతానంగా కొడుకు జ‌న్మించాడు. అయితే ఆమె చ‌నిపోవ‌డంతో ఆ బాబును ర‌వి-స్వ‌ప్న దంప‌తుల‌కు ద‌త్త‌త ఇచ్చారు. మూడు నెల‌ల‌పాటు సాదుకున్న త‌ర్వాత బాలుడి తండ్రి వ‌చ్చి తీసుకెళ్లాడు. 

 

ఆ త‌ర్వాత ఎలాగైనా ఒక మ‌గ‌పిల్లాడిని తీసుకొచ్చి భార్య‌కు ఇవ్వాల‌ని ర‌వి నిర్ణ‌యించుకున్నాడు. మార్చి 7న‌ నిఖిల్‌తో క‌లిసి ప్లాన్ వేసి గ్రామాల్లో తిర‌గ‌డం మొద‌లు పెట్టాడు. ఎక్క‌డైనా మగ‌పిల్లాడు క‌నిపిస్తే ఎత్తుకెళ్లాల‌ని తెగ‌ప్ర‌య‌త్నం చేశారు. ఈక్ర‌మంలో జ‌య‌శంక‌ర్‌భూపాల‌ప‌ల్లి జిల్లా సింగంప‌ల్లికి సాయంత్రం ఐదుగంట‌ల స‌మ‌యంలో చేరుకున్నారు. అక్క‌డ 11నెల‌ల బాలుడిని ఆడిపిస్తూ ఓ ముస‌ల‌మ్మ క‌నిపించింది. వెంట‌నే ఆమెను మాట‌ల్లో దింపారు. మీకు డ‌బుల్‌బెడ్ రూం ఇల్లు వ‌చ్చింది.. ఆధార్‌కార్డు తీసుకుర‌మ్మ‌ని చెప్పారు. వారి మాట‌ల‌ను న‌మ్మి ఇంట్లోకి వెళ్ల‌గానే.. బాలుడిని బైక్‌పై తీసుకుని పారిపోయారు. బాలుడిని స్వ‌ప్న‌కు అప్ప‌గించి, ఎవ‌రికీ అనుమానం రాకుండా ఇద్ద‌రినీ ఆమె స్నేహితురాలి ఇంట్లో ఉంచి, ర‌వి, నిఖిల్ వెళ్లిపోయారు. అయితే.. బాలుడి త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, ఫోన్‌సిగ్న‌ల్స్ ఆధారంగా బాలుడు రుద్రారం అనే గ్రామంలో ఉన్నాడ‌నే విష‌యాన్ని ప‌సిగ‌ట్టారు. వెంట‌నే మార్చి 10న రాత్రి బాలుడిని తీసుకుని త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు. ఇక పోలీసులకు దొర‌క‌కుండా ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న ర‌వి, నిఖిల్ మార్చి 11న తెల్ల‌వారుజాములు చిక్కారు. పోలీసుల విచార‌ణ‌లో నేరాన్ని అంగీక‌రించ‌డంతో అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: