శ్రీరాముడు.. మహావిష్ణువు దశావతారాల్లో ఓ అవతారం. కానీ అన్ని అవతారాల్లోకీ విశిష్టమైన అవతారం. మనుషులకు ఓ పాఠంలా అధ్యయనం చేయాల్సిన అవతారం ఈ రామావతారం. ఎందుకంటే. ఈ అవతారంలో రాముడు ఎలాంటి మహిమలు ప్రదర్శించడు. ఎలాంటి అతీత శక్తులూ చూపించడు. 

 

ఓ సాధారణ మానవుడిలాగానే జీవితాంతం కనిపిస్తాడు. అంటే ఓ మనిషి ఎలా బతకాలో.. తానే ఓ ఉదాహరణగా ఓ భగవంతుడు మనిషి కోసం చేసి చూపించిన అవతారం ఈ రామావతారం. మిగిలిన అవతారాల్లా కాకుండా వ్యక్తిత్వ విలువలకు, నైతిక నియమాలకు శ్రీరామావతారంలో  విశేష ప్రాధాన్యం ఉంటుంది. 

 


మానవ ఆదర్శాలకు, ఆరాధ్యమూర్తిమత్వాల కలబోత ఈ శ్రీరాముడు. అందుకే రామ’ శబ్దం  పరబ్రహ్మ తత్త్వానికి పర్యాయపదం అంటోంది యజుర్వేదం. అందుకే రామాయణం పంచమ వేదంగా గణుతికెక్కింది. సామాజిక అభ్యున్నతికి ఉపకరించే సూత్రాల్ని ఈ రామాయణం నిర్దేశించింది. 

 


సత్యం, ధర్మం అనే రెండు చక్రాల జీవన రథంలో ఎలా ముందుకు పయనించాలో రామాయణం సామాన్యుడికి దారి చూపుతుంది. అసలు రామ అనే పేరులోనే చాలా అర్థం ఉంది. రామ అంటే ర-అ-మ’ అనే మూడు బీజాక్షరాల మేలు కలయిక. ఇక్కడ ‘ర’కారం అగ్నితత్వం,  ‘అ’కారం సూర్యశక్తి, ‘మ’కారం చంద్ర అంశకు సంకేతం. అందుకే రాముడు మనిషికి ఆదర్శప్రాయుడు. మార్గదర్శి. 

 

 

రావణుడు రజోగుణంతో పెచ్చరిల్లాడు. కుంభకర్ణుడు తమోగుణానికి దాసుడయ్యాడు. విభీషణుడు సత్త్వగుణాన్ని అవలంబించాడు. సత్త్వగుణమే సాటిలేని మేటిదని విశదపరచడానికే రావణ, కుంభకర్ణాదుల్ని రాముడు వధించి, విభీషణుడికి పట్టంకట్టాడు.

 

అష్టాక్షరి, పంచాక్షరి మహామంత్రాల్లో    రా, మ అనే రెండు అక్షరాల్ని భద్రాక్షరాలుగా, జీవాక్షరాలుగా అభివర్ణిస్తారు. ఆ రెండు అక్షరాల సంపుటీకరణే- రమ్యమైన రామం. భద్రోభద్రయా అంటూ వేదం ఉపదేశించిన సుభద్రకరమైన భద్రబీజాక్షరాలకు సాకారం- భద్రాచల రాముడు.

మరింత సమాచారం తెలుసుకోండి: