మే 22, 2018న భారత పునరుజ్జీవన పితామహుడైన రాజా రామ్మోహన్ రాయ్ 246వ జయంతిని జరుపుకుంటున్నది. ఈయనొక సుప్రసిద్ధ భారతీయ సంఘ సంస్కర్త. 1828లో బ్రహ్మ సమాజంను స్థాపించారు. ఆ కాలంలో బ్రహ్మణేతరులతో కలిసి భోజనం చేశారు. ఉపనిషత్తుల్లోని నిరాకార తత్వాన్ని అంగీకరించి, మనవ సమాజంలో ఐక్యతను ఆకాంక్షించారు. అస్పృశ్యత, కులజాడ్యంపై చైతన్యం కలిగించారు. బ్రిటీష్ ప్రభుత్వం ద్వారా సతీసహగమనాన్ని నిషేధించారు.  మనదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు కృషి చేసిన రాయ్.. 1828లో బ్రహ్మ సభను స్థాపించారు. ఇదే తర్వాతి కాలంలో బ్రహ్మ సమాజంగా మారింది. భారతీయ సామాజిక, మత సంస్కరణోద్యమంలో ఇది కీలక పాత్ర పోషించింది. 

 

హిందూ మతంలోని అనేక దురాచారాలను రూపుమాపడానికి, సంస్కరించడానికి 1828లో రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. భారతీయ సామాజిక, మత సంస్కరణోద్యమానికి ఇది వెన్నుదన్నుగా నిలిచింది. ఆధునిక విద్యావ్యాప్తి, స్త్రీ జనోద్ధరణ కోసం విశేషంగా కృషి చేశారు. బహు భార్యత్వం, సతీసహగమనం లాంటి దురాచారాలను ఖండించారు.  బాల్య వివాహాలు, కులవ్యవస్థలోని లోపాలపై పోరాడారు. అంటరానితనాన్ని అప్రజాస్వామ్యం, అమానుషమని పేర్కొన్నారు. వితంతు పునర్వివాహాల కోసం కృషి చేశారు. స్త్రీ, పురుషులకు సమాన హక్కులుండాలని ఆయన గట్టిగా కోరారు. 

 

దేవుడికి, ప్రజలకు మధ్యవర్తులుగా ప్రత్యేక సౌకర్యాలు పొందుతున్న పురోహితుల తరగతిని రాజా రామ్మోహన్ రాయ్ నిరసించారు. రంగు, జాతి, కులాలకు అతీతంగా మానవులందర్నీ ఏకం చేయడానికి ఆయన కృషి చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన సాంఘిక సంస్కరణలు, ఆధునిక విద్యా సంస్థల ఏర్పాటును ప్రశంసించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం పత్రికల స్వాతంత్య్రంపై పరిమితులు విధించడాన్ని, భారతీయులను ఉన్నత పదవులకు దూరంగా ఉంచడాన్ని వ్యతిరేకించారు. కలకత్తాలో హిందూ కళాశాల స్థాపనకు ప్రయత్నించారు. ఆయన ఇంగ్లాండ్ వెళ్లడానికి ముందే మొఘల్ చక్రవర్తి ఆయనకు ‘రాజా’ బిరుదునిచ్చారు. బ్రిటన్ పర్యటనలో ఉండగానే మెదడువాపు వ్యాధితో 1833 సెప్టెంబర్ 27న బ్రిస్టల్ నగరంలో రాయ్ మరణించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇటీవల బ్రిస్టల్‌లోని ఓ వీధికి ‘రాజా రామ్మోహన్ వే’ అని నామకరణం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: