మనం నివసిస్తున్న మన సమాజములో ఒక అవివాహితుడైన యువకుడు ఒక అవివాహిత యువతితో వివాహం చేసుకోకుండా కలసి జీవించటం, సంసార  శృంగార దాంపత్య జీవితం అనుభవించటం "సహజీవనం"


భారతీయ సనాతన ధర్మం మాత్రమే కాకుండా, నేటి మన సమాజం సైతం అంతగా ఆదరించలేని, కనీసం ఆమోదించలేని విషయమిది. అంతేకాదు సహజీవనంలో ఉండేవారు సమాజము నుండి గౌరవం ఆశించలేరు.


ఇది భారతీయ సంస్కృతి గాదు. ఎక్కువగా పాశ్చాత్య దేశాలలో కనిపిస్తుంది. ప్రపంచం కుగ్రామంగా మారుతున్న ఈ కాలములో సమాచారం అరిచెతిలోకి రావటంతో సంస్కృతి మార్పిడి జరిగి మరీ ఈ మధ్య భారతదేశంలో కూడా యువతీ యువకులు అక్కడక్కడ సహజీవనం చేస్తున్నారు. కుడిఏడమై అక్కడ వైవాహిక సాంప్రదాయానికి రాచమార్గాలు ఏర్పడుతున్నాయి.  




సహజీవనానికి హద్దులు సరిహద్దులు అనేవి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి స్నేహం నుండి మొదలై శారీరక సంబంధం వరకు కూడా వ్యాపిస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా ఇరువురి అంగీకారంపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు సహజీవనం చేసే వారు కొంతకాలం తర్వాత వివాహబంధంతో కూడా ఒక్కటవుతారు. పాశ్చాత్య  దేశాలలో సహజీవనం చేస్తున్న జంటలు, పిల్లలను కూడా కలిగి ఉంటారు. ఇరువురూ ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత కలిసి ముందుకు సాగడమో! లేదా ఆ బంధానికి అక్కడితో ముగింపు పలకడమో! చేస్తారు.


సహజీవనం భారతీయ సమాజానికి ఇప్పుడు కొత్తగా కనిపించినా ఈ వ్యవస్థ కొన్ని శతాబ్దాల క్రితమే ఆచరణలో ఉండేదని తెలుస్తున్నది. మానవ మరియు సామాజిక విఙ్జాన శాస్త్ర దృక్కోణములో చూసినపుడు ఈ సహజీవనము మారుతున్న కాలానికి అనుగుణంగా వేగంగా రూపాంతరం చెంది పెళ్ళి మరియు కుటుంబ వ్యవస్థలతో ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ముడిపడి ఉన్నట్లు తెలుస్తున్నది. 


అంటే డార్విన్ పరిణామసిద్ధాంతం ఇప్పుడు భారత్ లో రివర్స్ లో నడుస్తుందన్న మాట. మానవుడు ఆదిమానవుని నుండి నాగరిక మానవునిగా, అటు పైన ఆధునిక మానవుడిగా రూపాంతరం చెందుతున్న పరిణామ క్రమంలోనే స్త్రీ పురుషుల సంబంధాల మధ్య గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. బహుశా ఇందులో సంతానం కోసం స్త్రీ పురుషులు సంభోగ  ప్రక్రియలో తప్పని సరిగా పాల్గొన వలసిరావడం ప్రధాన కారణంగా చెప్పవలసి రావచ్చు. మానవ జాతి సంభోగ ప్రక్రియలో ఇతర జీవజాతులతో తరచుగా పోల్చబడుతారు.


ప్రముఖ “న్యూరో బయాలజిస్టు రాబర్ట్ సపోల్‌ స్కీ” ఈ విషయంలో ఒక వివరణతో కూడిన డయాగ్రం తయారు చేశాడు. ఇందులో స్త్రీ పురుషుల ప్రవృత్తి  ఇరు ధ్రువాలుగా చూపబడింది. ఇందులో గమనించదగిన విషయం ఏమంటే పురుషుడు సంతానం కోసం స్త్రీతో జత కట్టడానికి ఆసక్తి చూపుతాడు. క్రమేణా ఆ బంధం బలపడి ఇరువురూ వివాహ బంధంలో అడుగు పెడతారు.



సహజీవనం అంశంపై తరచుగా వార్తలు వింటున్నాం. పెద్దపెద్ద వాణిజ్యసంస్థలలో ఆడామగా ఉద్యోగరీత్యా కలసి పనిచెయ్యడం ఈ రోజుల్లో సర్వ సాధారణం. ఈ పరిచయంలో ఏర్పడిన స్నేహాలు ఆకర్షణలు అవసరాలు క్రమంగా పెరిగి ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్తే తప్పులేదు.  


కాని మన సాంప్రదాయాలు, సంస్కృతిని మరచి పాశ్చాత్య నాగరికతలను అలవరచుకుంటూ స్త్రీ పురుషులు వివాహబంధం లేకుండా సహజీవనం సాగించడం లాంటి అనారోగ్యకర పరిస్థితులు మన సమాజంలో ప్రస్తుతం సర్వ సాధారణంగా గమనార్హం. ఇలాంటి పరిస్థితులు సమంజసమా? కాదా? ఇది మన దేశ సంస్కృతికి పూర్తిగా భిన్నం అని అలోచించే తీరిక ఎవరికీ లేకుండా పోతుంది. అవసరం అవకాశం ప్రధానంగా సమాజం తనమునకలై పోతుంది. 


మన వివాహ సాంప్రదాయం ఇరు యువతీ యువకులను పెళ్ళినాటి ప్రమాణాలతో వేద మంత్రాలు, అగ్నిసాక్షిగా వధూవరులను చేయించే ప్రమాణాలు వీటన్నింటికి ఒక పవిత్రత, ప్రత్యేకత కలిపి పలువురు పెద్దలు ఆ దైవ సమక్షంలో ఒకటయ్యే తంతు నిర్వహిస్తారు. ఈ వివాహ తంతుకు నియమ నిష్టలతో కట్టుబడి భార్యాభర్తలు ఒకరి నొకరు అర్ధం చేసుకుని శృంగారంతో కూడిన దాంపత్యం కొనసాగిస్తుంటారు. 


మన వివాహవ్యవస్థలో పవిత్రతను ఇరు తనువులను మనఃపూర్వకంగా ఒక్కటిగా ఏకం చేసే గొప్పతనాన్ని ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుని గౌరవిస్తున్నాయి. ఇంత గౌరవ ప్రతిపత్తులున్న భారతీయ వివాహవ్యవస్థని కాదని ఆధునిక ప్రపంచంలో స్త్రీ పురుష ఆకర్షణలకు లోబడి, కేవలం శారీరక అవసరాల నిమిత్తం ఏర్పరచుకున్న ఈ ప్రక్రియకి "సహజీవనం" (లివ్-ఇన్-రిలేషణ్-షిప్) అని పేరుపెట్టుకుని కొన్నాళ్ళు కాపురం చేస్తున్నారు. 


తర్వాత ఒకరికొకరు కావాలంటే వివాహం చేసుకోవటం కలసి జీవించటం జరుగుతుంది. లేకుంటే ఇరువురు వేరు వేరు వ్యక్తులను వివాహం చేసుకుని  కొన్నాళ్ళు కాపురం చేసి, పిల్లల్నికని వాళ్ళని వారిదారికి వదలి - వేరొకరితో సహజీవనంలోే సంతానాన్ని కని తరువాత సంబంధం పెట్టుకుని సహజీవనం సాగిస్తున్నారు.  


దేశ విదేశాల్లో తరచుగా ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం తమ అవసరాలకు సహజీవనం ఏర్పరచుకుంటున్న సందర్భాలు ఈ అధునిక సమాజం లో కోకొల్లలు. నాగరికత మార్పిడిలో ఈ జాడ్యం మనదేశంలో ప్రవేశించి మన సమాజానికి కాన్సర్ లాగా సోకింది. అయితే ఈ సంస్కృతికి జన్మించిన ఏది మంచో ఏది చెడో తెలియని పసి హృదయాలు తమ తల్లి తండ్రులు ఎవరో తెలియకనో తెలిసినా చెప్పుకోలేకనో హృదయ విదారకంగా బలి అయిపోతున్నారు. 


“సహజీవనానికి న్యాయస్థానాలు అంగీకరించవలసి రావటంతో కుటుంబ సంసారభారం మొయ్యలేని, సోమరిపోతులకు బాధ్యతారహితులకు ఒక రకంగా వరంగా మారుతూ వస్తుంది. బహుశ అలా బాధ్యతా రాహిత్యానికి నెలవుగా మారుతుందేమో ఈ సహజీవనం. వాళ్ళ కుటుంబ వ్యవస్థ కూలిపోయి, దారి తెన్ను తెలియని, ప్రేమకు నోచుకోని పిల్లలు, అమెరికా మాదిరిగా ప్రభుత్వ నిర్వహణ నియంత్రణ వ్యవస్థలలో ఉంటూ పెరిగి పెద్దవారై కొన్నిసార్లు సంఘ విద్రోహ శక్తులుగా మారే ప్రమాదం పరిస్థితులు దాపురించవచ్చు. 



"మన దేశ విద్యావంతులు సంస్కృతిని సంరక్షించ వలసిన మేధావులు ఈ విషయంపై కూలంకషంగా చర్చించి, ప్రజల్లో వ్యాపిస్తూ సమాజాన్ని మార్చేస్తున్న సహజీవన పెడ ధోరణలను సంస్కరించి తగురీతిలో నియమ నిబంధనల చట్రంలో ఉంచి అరికట్టడానికి ప్రయత్నించి కనీసం మనసమాజం, మన సంసృతి, మన సాంప్రదాయం మొదలైన వాటిని కాపాడుకోవడం ఎంతైనా అవసరం" 


సహజీవన౦ ఏ సమాజానికీ మ౦చిది కాదు. కుటు౦బ౦ అన్నది ఒక సా౦ఘిక కట్టుబాటు. కట్టుబాట్లు లేని వ్యవస్థ దెబ్బ తి౦టు౦ది. ఏ వ్యవస్థైనా నిలబడాల౦టే కట్టుబాట్లు ఉ౦డాలి. అ౦తె౦దుకు ఒక కార్యాలయం ప్రారంభిస్తే దాని నిర్వహణకు తగిన విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించినట్లే  వివాహవ్యవస్థ లో కూడా ఆలూమగలు ఒకరికి ఒకరై, ఎక్కువ తక్కువలు లేకు౦డా, సమాజానికి సత్స౦తాన౦ ఇవ్వాలనే వివాహా విధివిధానాలు నిర్ణయి౦చారు. 


సహజీవన౦ వల్ల పిల్లలు స౦ఘవిద్రోహులుగా మారతారన్నది నిజ౦. తండ్రి ఎవరో తెలియక ఉన్న తల్లి కుడా తన సుఖాలకు పరుగెడుతుంటే పిల్లలకు మార్గదర్శిగా ఎవరు ఉంటారన్న సమస్య వెలుగు చూస్తుంది. 


సెలబ్రిటీలు ఏది చేసినా సంచలనమే. వారి పెంపుడు కుక్కకు దెబ్బ తగిలినా సోషల్ మీడియా విల విలలాడిపోతుంది. సోషల్ మీడియాలో సినీనటి గౌతమి తన సహచరుడు కమల్ ‌హాసన్‌తో ఉన్న 13 ఏళ్ల బంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నట్లు, ఈ మాటను మీతో చెప్పటానికి మనసు ముక్కలైందన్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించటంతో మరోసారి సహజీవనంపై సరికొత్త చర్చకు తెరలేచింది. 


ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని ఇలాంటి సెలబ్రిటీలు విడిపోతే జరిగే నష్టం ఉండదు. కాని ఇబ్బందల్లా ఇలాంటి వారిని అనుసరించే సామాన్యులు, ఆధునిక యువత సహజీవనం వైపు మొగ్గు చూపుతుండటం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. నేటి ఆధునిక సమాజంలో సహజీవనం అనేది సర్వసాధారణమైన అంశంగా మారిపోయింది. ఆడ, మగ పరస్పర సానుకూల అభిప్రాయాలతో కలిసి ఉండటానికి ఇష్డ పడటాన్ని న్యాయస్థానాలు సైతం తప్పుపట్టడం లేదు. 



కాని సహజీవనం వల్ల తలెత్తే సమస్యల వల్ల మహిళలు బాధితులుగా మిగులు తున్నారనేది కాదనలేని సత్యం. సహజీవనంలో సహచరుడు నుంచి వేధింపులు, హింస ఎదుర్కొంటే, ఆమెకు గృహహింస చట్టం కింద న్యాయం అందించాలని అత్యున్నత న్యాయస్థానమే సెలవిచ్చింది. సహజీవనం చట్టబద్దమైన బంధంగా పరిగణించేలా చట్టం తీసుకురావాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి ఒక సూచన కూడా చేసింది.


వివాహబంధం అనేది ఆర్థిక బంధంగా మారిపోవటంతో పట్టణ ప్రాంతాల్లోని యువత సహజీవనం వైపునకు అడుగులు వేస్తోంది. చదువుల కోసం, ఉద్యోగాల కోసం పట్టణాలకు వచ్చే యువతీ యువకులు సహజీవనానికి ఇష్టపడు తున్నారు. ముఖ్యంగా యువకులు పెళ్లికి ముందు శృంగారం (సెక్స్) అనేది తప్పు కాదు అని భావిస్తూ సహజీవనానికి మొగ్గుచూపు తున్నారు. 


యాభై ఒక్క శాతం మంది యువకులు ఇలాంటి మార్గం వైపు రావటానికి ఇష్ట పడుతున్నట్లు ఈ మద్య చేసిన ఒక సర్వేలో వెల్లడైంది. శారీరక బంధంతో కలిసి జీవించాలనుకునే ఇలాంటి యువతీ యువకులు - ఆ బంధాన్ని తెగతెంపులు చేసుకునే సందర్భంలో "రేప్-కేసులు" గా నమోదు చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 


దేశ రాజధాని ఢిల్లీలో నమోదవుతున్న కేసులలో దాదాపు 25 శాతం వరకు ఇలాంటి బాపతే. శారీరక బంధంతో కలిసి జీవిస్తూ పెళ్లి చేసుకోవటం లేదని యువతులు పోలీసులను ఆశ్రయస్తున్నారు. ఢిల్లోలో 1,656 రేప్ కేసులు నమోదుకాగా,  419 కేసులు సహజీవనం చేస్తూ విడిపోయిన వారు పెట్టుకున్నవేనని తేలింది.


సహజీవనాన్ని మన సమాజం ఎంతమాత్రం ఆమోదించటం లేదు. అత్యధిక శాతం మంది పెద్దలలో ఈ సహజీవనంపై తిరస్కరణ భావం ఉంది. 80 శాతం మంది తల్లిదండ్రులు తమ బిడ్డలు సహజీవనం చేస్తామంటే అంగీకరించకపోగా, దీన్ని బలహీనతగా భావించి బాధపడు తున్నారు. బలహీనతలను అధిగమించి శాశ్వత బంధమైన వివాహబంధంలోనే యువతీ యువకులు ఇమిడిపోతే తరువాతి తరం ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుందన్న పెద్దల ఆలోచనలలో వాస్తవం లేకపోలేదు.


వివాహం పట్ల పరస్పరం విశ్వాసం నమ్మకం, గౌరవభావం ఉంటే ఎలాంటి భేదాభిప్రాయాలు వచ్చినా విడిపోకుండా ఆ బంధాన్ని గౌరవిస్తూ జీవిస్తారు. కాని సమాజంలో అభద్రతకు లోనైన ఒంటరి మహిళలు, కట్నకానుకలు, పెళ్లి ఖర్చులు, లాంచనాలు వంటి వాటిని వ్యతిరేకించే ఆధునిక యువతులు సహజీవనం వైపునకు మొగ్గు చూపుతున్నారు. 


ఇలాంటి వారు 36 శాతం మంది ఉన్నట్లు ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. ఏ బంధమైతే తమకు అండగా నిలబడుతుందని భావిస్తారో అదే వారి బలహీనతగా మారి విడిపోవటానికి కారణమవుతోంది. ఎందుకంటే 45 శాతం మంది యువకులు తన సహచరిణి కన్యగానే ఉండాలని కోరుకుంటున్నారని అదే సర్వే చెపుతుంది.  


డేటింగ్ పేరుతో యువకులు తమకు నచ్చిన యువతులతో కలిసి ఒకే ఇంట్లో కొంతకాలం మాత్రమే ఉంటున్నారు. ఆ తరువాత చిన్నచిన్న కారణాలతో విడిపోతున్నారు. ఇలా అనునిత్యం అపనమ్మకాల తోనూ, అవిశ్వాసంతో, ఆర్థిక లాభాపేక్షతోనూ,ఆధిపత్య ధోరణిలతో ఒకే కప్పుకింద జీవించాలనుకునే వారిలో గొడవలు, కీచులాటలు, అభిప్రాయ భేదాలు ఎన్నో వస్తాయి. అవి ఎక్కువసార్లు విషాదాన్ని మిగులుస్తాయి. 


ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తితో కలిసి జీవిస్తున్నామంటే పరస్పర సహకారం, ధైర్యం, తోడు, సర్దుబాటుతత్వం ఉండాలి. అలా లేనినాడు అది వివాహ బంధమైనా, సహజీవన బంధమైనా గౌరవాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయి ఆకర్షణలకు లొంగి పోయి తాత్కాలిక బంధాలకు తెరతీసినట్లవుతుంది.


ఇద్దరికీ సమాన పాత్ర ఉన్నపుడు, ఇద్దరూ సమానమైనపుడు 497 సెక్షన్ చట్టబద్ధం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఇష్ట పూర్వక శృంగార సంభందాలు ఇప్పుడు ఐపిసి 497 రద్ధుతో సహజీవనానికి మరింత స్వేచ్చ లభించింది.





 

మరింత సమాచారం తెలుసుకోండి: