వరకట్నం.. అమ్మాయి పెళ్లి కావాలంటే ఇండియాలో ఇది ఇవ్వక తప్పదు.. ఏవో కొన్ని గిరిజన వర్గాల్లో తప్ప దేశమంతా  అమ్మాయి పెళ్లికి కట్నం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. కట్నం తీసుకోవడం నేరం అని మన దేశంలో చట్టాలు ఉన్నా.. కట్నం ప్రస్తావన లేకుండా మన దేశంలో నూటికి కనీసం 5 శాతం పెళ్లిళ్లు కూడా జరగవు. ఈ వరకట్నం కారణంగా ఆడపిల్లల తల్లిదండ్రులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అమ్మాయి సుఖంగా ఉండాలన్న ఒకే ఒక్క కారణంగా తాహతుకు మించిన సంబంధాలు చూస్తూ.. ఆర్థికంగా కష్టాల్లో చిక్కుకుంటున్నారు.

అయితే మన దేశంలోనూ అమ్మాయిల జనాభా తక్కువగా ఉన్న చోట్ల కట్నం ప్రసక్తి తగ్గిపోయింది. అయితే మన పొరుగున ఉన్న చైనాలో అయితే పరిస్థితి పూర్తి రివర్స్‌గా ఉందట. అవును మరి..అక్కడ నిన్న మొన్నటి వరకూ  ఒకే బిడ్డ విధానం అమల్లో ఉంది కదా. అందులో చాలామంది అబ్బాయిని కనేందుకు ఇష్టపడ్డారు. దీంతో అబ్బాయిల జనాభా పెరిగింది. అమ్మాయిలు కరువయ్యారు. దీంతో అమ్మాయిలకు డిమాండ్ పెరిగింది. 2010నాటికి చైనా జనాభాలో ప్రతి 118మంది పురుషులకు  కేవలం 100 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారట.

ప్రస్తుతం చైనాలో స్త్రీలకన్నా పురుషుల సంఖ్య 3.3 కోట్లు ఎక్కువగా ఉంది. ఈ తేడా కారణంగా చైనాలో వధువుల కొరత బాగా ఉందట. ఇక గ్రామాల్లోని పేద చైనీయులకు పెళ్లికూతురు  దొరకడం లేదట. దీంతో అమ్మాయిలకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. కొన్నాళ్లుగా  ఈ  కన్యాశుల్కం కూడా బాగా పెరిగిపోయిందట. ఒకప్పుడు 11 వేల యువాన్లు అంటే మన కరెన్సీలో లక్షన్నరగా ఉన్న కన్యాశుల్కం, ఇప్పుడు ఏకంగా 10 లక్షల యువాన్లకు చేరిందట.

మన ఇండియా లెక్కల్లో చెప్పాలంటే.. ఇప్పుడు చైనాలో ఓ అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే.. అమ్మాయికి దాదాపు కోటి రూపాయలకు పైగా కట్నం ఇవ్వాల్సి వస్తోందట. అంతే కాదు.. కన్యాశుల్కంతో పాటు  అమ్మాయి తల్లిదండ్రులకు కొత్త కారు, ఇల్లు కొనిపెట్టాల్సి వస్తోందట. పెళ్లి ఇంత ఖరీదైన వ్యవహారం కావడంతో  పల్లెల్లోని చైనా కుర్రాళ్లు పెళ్లికి దూరమవుతున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: