అంద‌రి భ‌విష్య‌త్ చెప్పే మాతంగి స్వ‌ర్ణ.. ల‌ష్క‌ర్ బోనాల్లో ఈ సారి కూడా త‌న వాణి వినిపించింది..తెలంగాణను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాను అని అంటోంది.. మ‌రి! అంద‌రి భ‌విష్య‌త్ చెప్పే ఆమె జీవితం ఈ ఒక్క రోజే వెలిగిపోతుంది.. ఈ ఒక్క రోజే ప‌సుపు కుంకుమ‌ల పూజ‌ల‌తో దేదీప్య మానం అవుతుంది.. నుదిటిన రూపాయ కాసు అంత బొట్ట‌తో మెళ్లో పూల  దండ‌ల‌తో ఆమె ప‌లికిన మాటలు వింటూ త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్  ఆనందిస్తున్నారు... మ‌రి! ఆ మంత్రి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారా?
జీవితం ఇది జీవించాలంటే అని అంటారు ప్రముఖ గాయ‌కులు యేసుదాసు..అలా ఆమె రేప‌టి నుంచి సికింద్రాబాద్ వీధుల్లో సాదా సీదాగా జీవించే ఓ టైల‌ర్..ఓ చిన్న రూమ్ లో అద్దెకు ఉంటూ జీవితాన్ని నెట్టుకువ‌చ్చే వైనం క‌డు దుర్భ‌రం.. అస‌లు మ‌నం ఊహించ‌లేం.. మీ జీవితాలు మారిపోతాయి.. మీ జీవితాలు గొప్ప గొప్ప క‌ల‌ల వైపు ప‌రుగులు తీస్తాయి అని చెప్పే ఆ త‌ల్లి జీవితం అలానే ఆగిపోతుంది. ముందుకు పోదు వెనక్కు  వెళ్ల‌దు.. ఒంటి కుండ‌పై నిల్చొని భ‌విష్య‌త్ చెప్పే ఆ మాతంగి ఏళ్ల‌కు ఏళ్లు ఇలానే జీవిస్తోంది. ఆమె అక్క కూడా ఇలానే భ‌విష్య వాణి వినిపించేది.. ఈ ఒక్క రోజు దాటితే ఆమె అతి సాధార‌ణ మ‌నిషి.. కొంద‌రికి ఏమీ కాని మ‌నిషి.. ఆ వెలుగుల్లో ఆమె పెద్ద ముత్తైదువ.. ఆ వెలుగు దాటాక ఆమె జీవితం క‌న్నీళ్ల‌కు అత్యంత చేరువ.. అయినా ప్ర‌జ‌ల క్షేమం  కోరి ప‌లికే మాట.. ఆ  అమ్మ‌వారి అర్చ‌న‌లో అంకింత అయిన స‌మ‌యం త‌న‌లాంటి వారికో ఊర‌ట అని చెబుతారామె.. అమ్మ ఏడాదికో సారి గ‌ద్దె దిగుతుంది.. కానీ ఆమె స‌మ‌స్య‌లూ సంబంధిత  చీక‌ట్లూ అలానే ఉంటాయి.. ఇరుకు  గ‌దిలో జీవనం సాగించే ఆమె ప్ర‌భుత్వాల సాయం అంద‌దు.. పోనీ క‌నీసం ఉపాధి పొందుదామ‌న్నా రుణం ద‌క్క‌దు. అంద‌రి మ‌న్న‌న‌లూ అందేది ఆషాఢ బోనాల స‌మ‌యంలోనే ! ఇప్పుడు తెలంగాణ లో అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకుని తిరిగే నాయ‌కుల‌యినా ఆమెకు సాయం చేస్తే మేలు.

మరింత సమాచారం తెలుసుకోండి: