దేశంలో పేరెన్నిక‌గ‌న్న చారిత్ర‌క ప్ర‌దేశాలు, ఆధ్యాత్మిక ప్ర‌దేశాలు చూపించేందుకు ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ ఒక ప్ర‌త్యేక ప్యాకేజీని ప్ర‌క‌టించింది. ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ ప‌ర్య‌ట‌న సెప్టెంబ‌రు 10వ తేదీవ‌ర‌కు కొన‌సాగ‌నుంది. భార‌త్ ద‌ర్శ‌న్ పేరుతో ఉండే ఈ ప్యాకేజీలో 11 రాత్రులు/12 ప‌గ‌ళ్లు ఉంటాయి. ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను సంద‌ర్శించేలా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు వెల్ల‌డించారు.

అన్నీ ఒకేసారి చుట్టివ‌చ్చేలా
దేశంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్రాల‌ను ఒకేసారి చుట్టివ‌చ్చేలా ఐఆర్‌సీటీసీ భార‌త్ ద‌ర్శ‌న్ పేరుతో ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని రూపొందించింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో స్టాట్యూఆఫ్ యూనిటీ, జైపూర్‌, అమృత్‌స‌ర్‌, భావ్‌న‌గ‌ర్‌లోని నిష్క‌లంక్ మ‌హాదేవ్ సీటెంపుల్‌, అహ్మ‌దాబాద్‌, హైద‌రాబాద్ ఉన్నాయి. టికెట్ ధ‌ర రూ.11,340గా ఉంది. స్లీప‌ర్‌క్లాస్ టికెట్‌తోపాటు వెజిటేరియ‌న్ భోజ‌నం, నాన్ ఏసీ ర‌వాణా, హాల్ సౌక‌ర్యం క‌ల్పిస్తారు. ప‌ర్య‌ట‌న‌కు రావాలనుకునేవారు త‌మ టికెట్ల‌ను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వచ్చు.

జోన‌ల్‌, రీజ‌న‌ల్ కార్యాల‌యాల్లో కూడా బుక్‌చేసుకోవ‌చ్చు
ప‌ర్య‌ట‌న‌కు రావాల‌నుకునేవారు త‌మ టికెట్ల‌ను ఐఆర్‌సీటీసీ జోనల్‌, రీజనల్‌ కార్యాలయాల్లో బుక్ చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించారు. ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేవారికి ర‌వాణా బీమాతోపాటు శానిటైజేష‌న్ కిట్‌ను కూడా అంద‌జేస్తారు. ప‌ర్య‌ట‌న ప్రారంభ‌మ‌వ‌డానికి 48 గంట‌ల ముందుగా కొవిడ్ టీకా తీసుకున్న‌ట్లు ఒక ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొనే ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎవ‌రైనా ఉంటే వారికి టూర్ పూర్త‌యిన త‌ర్వాత ఎల్‌టీసీ సౌక‌ర్యం ఇవ్వ‌నున్నారు. ఈ ప్యాకేజ్‌కు ముందే ఐఆర్సీటీసీ ఏడు రోజుల ప‌ర్య‌ట‌న కార్య‌క్ర‌మాన్ని కూడా ప్ర‌క‌టించింది. దీనికి ఇప్ప‌టికే టిక్కెట్లు కూడా పూర్త‌యిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అది పూర్తిగా ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌ను చూపించే కార్య‌క్ర‌మమ‌ని, కాశీ, గ‌య‌, ప్ర‌యాగ‌, త్రివేణీ సంగ‌మం లాంటివాటిని భ‌క్తులు సంద‌ర్శిస్తార‌ని తెలిపారు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఐఆర్‌సీటీసీ దేశంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్రాల‌ను, ఆధ్యాత్మిక కేంద్రాల‌ను సంద‌ర్శించివ‌చ్చేలా ప్యాకేజీలు ప్ర‌క‌టిస్తూ వ‌స్తోంది. ప్ర‌జ‌ల నుంచి కూడా వీటికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag