ప్రపంచ శాంతి, చాలా పెద్ద మాట. అందరు అనుకుంటే అయిపోద్ది, అందుకే ఎప్పుడూ పుల్లలు పెట్టేవాళ్ళు పక్కనే ఉండి దానిని జరగకుండా చూసుకుంటూ ఉంటారు. ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి మరి. ఒకాయన వ్యాపారం జరగాలని విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేస్తాడు. అనంతరం వాళ్ళు కొట్టుకోడానికి ఆయుధాలు అమ్ముతాడు. ఆయనకు వ్యాపారంగా కలిసొచ్చిందా లేదా అనేదే ముఖ్యం మిగిలిన వారు ఎంత ఇబ్బంది పడుతున్నది ఆయనకు అనవసరం. ఇదే వాళ్ళ మనస్తత్వం. ఏ పరిస్థితులలో అయినా వాళ్ళు ఇలాగె ఉంటారు. అందుకు వాళ్ళు సరాసరి అన్ని వాళ్లే చేసేయరు. తెరవెనుక మాత్రం ఉండి ముందు కాపీలను పెట్టి నడిపిస్తూ ఉంటారు. ఆ కాపీలు ఒకనాడు వాడి మాట కూడా వినకుండా స్వేచ్ఛను కోరుకుంటూ కొత్తదైనా తమ లోకం కోసం పోరాటం చేయడం ప్రారంభిస్తాయి.

ఇక్కడ కాపీలే ముష్కరులు. వీళ్ళను ఆయా దేశాలు స్వార్థప్రయోజనాల కోసమే సృష్టించాయి. అనంతరం అవి వారి మాటలు లెక్కచేయక ప్రపంచాన్ని పీడించడమే ప్రధాన ఎజండాగా బ్రతికేస్తున్నాయి. వాళ్ళ లక్ష్యం ఏమిటని అడిగితే తమ కంటూ ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేసుకోవాలని చెప్తారు. అంటే ప్రపంచాన్ని ఇష్టానికి నాశనం చేసి అది కూడా తట్టుకొని మిగిలిన వారిపై ముష్కరులు పెత్తనం చేస్తారు.. అదే వాళ్ళ లక్ష్యం. అంటే ఒక వర్గంలో మానవత్వం నశించిపోయింది అని అర్ధం అవుతూనే ఉంది. ఇక సామాన్య జనం విషయానికి వస్తే వాళ్ళు  రాజకీయ చదరంగంలో ఎప్పుడో పావులు అయిపోయారు. వాళ్ళు కూర్చోబెడితే కూర్చుంటారు, కొట్టుకోమంటే కొట్టుకుంటారు.. అంటే పక్కా బానిసలైపోయారు. వీళ్ళలో మానవత్వం ఉన్నా అది కూడా నిస్సత్తువతో పనికిరాదు. మరి మానవత్వం లేని శరీరాన్ని మనిషి అని సంబోధించడం సబబేనా..!

అసలు మానవత్వం లేని సమాజంలో ప్రపంచ శాంతి స్థాపన ఎలా సాధ్యం అవుతుంది. అయినా ప్రయత్నిస్తా అంటే ఒక్కటే మార్గం ఉంది, నేను విశ్వానికి తల్లినైతే అనే ఆలోచన ప్రతి వారిలో మొదలైతే మార్పు మొదలైనట్టే. తల్లి అంటేనే నిలువెత్తు ప్రేమకు ప్రతిరూపం.  ప్రేమ ఉన్నచోటే మానవత్వం చిగురిస్తుంది. అది ఉంటేనే మనిషి ఉన్నట్టు, వాడంటూ ఉంటె శాంతికి పునాది పడ్డట్టే. ఈ చిన్న ఆలోచన ప్రపంచానికి శాంతిని చేకురుస్తుంది అంటే అనుసరించడం తప్పేమి కాదేమో! ప్రపంచ శాంతి వర్ధిల్లాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: