ప్రభుత్వ ఆసుపత్రులు.. అనారోగ్యంతో ఇబ్బంది పడే పేదలకు దేవాలయాలు.. ఇక్కడకు వచ్చే వారంతా నిరుపేదలే.. లక్షలు, వేలు ఖర్చు చేసి జబ్బులు నయం చేసుకోలేని వాళ్లే ఎక్కువగా ప్రభుత్వాసుపత్రులకు వస్తుంటారు. అలాంటి వారు ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే.. రోగుల కుటుంబీకులు, సహాయకులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడో ఓ మూలన తలదాచుకున్నా.. తినేందుకు సరైన తిండి దొరకదు..అంతంత ఖరీదు పెట్టి భోజనం చేయలేరు.


ఇలాంటి వారి ఇబ్బందులు గమనించింది ఓ స్వచ్ఛంద సంస్థ.. హైదరాబాద్‌లోని నిమ్స్, ఈఎస్‌ఐ వంటి ఆస్పత్రుల వద్ద రోగులకు, వారి బంధువుల ఆకలి బాధలు తీరుస్తోంది. హైదరాబాద్‌లో ఏ ఒక్కరూ ఆకలిగా ఉండకూడదనే ధ్వేయంతో పని చేస్తున్న ఈ సంస్థ పేరు నిస్వార్థ్‌ సహయోగ్. హైదరాబాద్ కు చెందిన సందీప్ గుప్తా, రూపా గుప్తా దంపతులు ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. వీరికి నితీష్ బోహ్రా, అనూప్ సుమిత్ వంటి మరికొందరు చేయి కలిపారు.


అప్పటి నుంచి నిస్వార్ధ్ సహయోగ్  పేరుతో ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు. నిమ్స్ ఆస్పత్రి తో పాటు ఈఎస్ ఐ ఆస్పత్రి వద్ద కూడా రోజూ అల్పహారం అందిస్తుంటారు. గతేడాది అక్టోబర్‌లో కరోనా సమయంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. దాతల సాయంతో కార్యక్రమాలు విస్తరిస్తున్నారు. రెండు కేంద్రాలు ప్రతిరోజూ నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ దాదాపు 600 మంది వరకూ అల్పాహారం పెడుతున్నారు.


నిమ్స్ ఆస్పత్రి వద్ద 300 మందికి పైగా రోగులు, బంధువులకు అల్పాహారం ఇస్తున్నారు. ఈఎస్‌ఐ వద్ద కూడా 300 మందికి వరకూ ప్రతి రోజూ ఉదయాన్నే అల్పాహారాన్ని అందిస్తున్నారు. నగరంలో ప్రజలతో పాటు నగరానికి వచ్చిన వారు ఆకలితో అమలటించకూడదన్నదే వీరి ధ్యేయం. తమను చూసి మరికొందరు ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభిస్తే హైదరాబాద్ లో ఆకలి బాధలు ఉండబోవంటున్నారు ఈ నిస్వార్థ సేవకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: