చదువుకున్న వాడికంటే చాకలివాడు మేలు అన్నారు ఒకప్పుడు, ఎందుకంటే చదువుకొని కూడా సరిగా తెలుగును ఉచ్చరించలేని వారిని చూసి అలా అనాల్సి వచ్చింది. నేడు చదువుకున్న వారు కూడా అదేవిధంగా తయారవుతున్నారు. పుస్తకాలలోది బుర్రలో కూడా పెట్టుకోకుండానే పరీక్షలు గట్టెకేస్తుంటే అంతకంటే ఎలా ఉంటారు. సాధారణంగా చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది అంటారు, కానీ నేటి చదువులలో అది ఉందొ లేదో కానీ చదువుకుంటున్న వాళ్లలో మాత్రం కొరవడిందని చెప్పాల్సి ఉంటుంది. కేవలం సంస్కారాలు అలవర్చుకోవడానికి చదువులు ఉన్నాయి గతంలో, ఇప్పటి చదువులలో మార్కులు తప్ప మరొకటి ఉండటం లేదు. అందుకే సంస్కారం తెలియక, లేనిపోని, ఎన్నడూ చూడని చట్టాలు కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంత చదువుకుని తనదారిన తాను బ్రతుకుతాడా అంటే అది కూడా కాదు, ముందు తనతో ఉన్నవారిని కిందకు లాగి తానేదో పైన ఉన్నట్టు భావిస్తున్నారు.

ఇలాంటిది కూడా విజయం అనుకోవడం ఎంత అవివేకమో అర్ధం చేసుకోవచ్చు. ఎప్పుడు పక్కవాడు పడిపోతే మనం ముందుకు వెళ్ళిపోదాం అనుకునే రోజు ప్రారంభం అయ్యిందో అప్పటి నుండి సంస్కారం మంటగలిసి పోతూనే ఉంది. అందుకే రోజురోజుకు లోకంలో ఒకరిమీద ఒకరికి నమ్మకాలు సడలిపోతున్నాయి. దీనితో ఎక్కడ చూసినా అభద్రతా భావన, ఒంటరి తనం, నిరుత్సాహం, నిస్పృహలు తాండవిస్తున్నాయి. అందుకే దేశంలో ఇంత యువత ఉన్నప్పటికీ కేవలం సాధించాల్సిన దూరం మాత్రం కాస్త కూడా తగ్గటం లేదు. ఎక్కడో ఎవరికి నష్టం వాటిల్లినా కూడా అదేదో మన శత్రువుకు జరిగినట్టు పండగ చేసుకునే మానసిక రుగ్మతలతో ఉన్నది నేటి సమాజం. అందుకే కరోనా సమయంలో కూడా విలయతాండవం చేయదలచిన వారికి కొందరు అండగా ఉండగలిగారు.

ఒకడు పడిపోతే చేతిని అందించే స్వచ్ఛమైన మనసు ఇంకా ఎక్కడైనా బ్రతికే ఉందా, ఉంటె దానిని అడుగు స్వేచ్ఛ అంటే చెప్పేస్తుంది. అలా కాకుండా దేనికో ఒకదానికి బానిసవై ఎప్పుడు ఎదుటివారిపై ఏడ్చే వాళ్ళు పెద్దగా దేశానికి కాదుకదా, కనీసం వాళ్ళ కుటుంబాలకు కూడా పనికిరారు అనేది చరిత్ర ఎప్పుడో చెప్పేసింది. ఇదంతా కొన్ని ధర్మగ్రంధాలలో ఉన్నప్పటికీ వాటిని కూడా కధల పుస్తకాలతో పోల్చేసి, పట్టించుకోలేని స్థితిలో ఉండిపోతుంది ఈ గుడ్డి అని నటిస్తున్న సమాజం. దానిలో ముందు మార్పులు వస్తే ప్రపంచ శాంతి లాంటి అత్యున్నత లక్ష్యాలు కూడా సులభతరం అవుతాయి. లేదంటే స్వేచ్ఛ అనే చిన్నది కూడా పొందలేక బానిసలుగానే బ్రతికేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: