కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా నిరుపేదలు పట్టణాలనుంచి గ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. తినడానికి తిండిలేక అలమటించారు. ఆకలి చావులకు గురయ్యారు. ఆ మహమ్మారి సంక్షోభం కారణంగా కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. ఇప్పటికీ నిరుద్యోగ సమస్య వేధిస్తూనే ఉన్నది. కోట్లాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. చాలామంది ఆకలి కోరల్లోకి జారుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా రేషన్ అందిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా  రేషన్ అందించింది. అయితే ఉచిత రేషన్ పథకం ఈనెల 30 నుంచి నిలిపి వేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలోనే ఉచిత రేషన్ అందించడాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని డిమాండ్ చేస్తూ ఆహార హక్కు ప్రచార వేదిక.. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు , ఆహార ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఉచిత రేషన్ పథకాన్ని పొడగించాలని ఇదివరకే సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు కేంద్రాన్ని కోరారు.

 ఆర్టిఎఫ్సి కేంద్రానికి రాసిన లేఖ లో కరోనా మహమ్మారి కారణంగా ప్రజలపై ఆర్థిక భారం పడింది. కోట్లాది మంది ఆకలి కొరల్లోకి జారుకున్నారు.    కోవిడ్-19 సృష్టించిన ఇబ్బందులను ఎదుర్కోవడంలో ఉచిత రేషన్ అందించడం .. ఎన్ఎఫ్ సిఎ కింది జాబితా చేయబడిన 80 కోట్ల మంది భారతీయులకు మద్దతు ఇవ్వడానికి ఇది చాలా అవసరమైన చర్య అని  పేర్కొంది. అలాగే మహమ్మారి ప్రభావం ఇప్పటికీ కొనసాగుతున్నదని,ప్రజలపై ఆర్థిక ప్రభావం,అనిశ్చితి, రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కోల్పోవడం ఇప్పటికి ఉపాధి లేని వారు అధికంగా ఉండటం వంటి పలు అంశాలను ఈ లేఖ ఎత్తిచూపింది. సెప్టెంబర్ 2021 నాటికి దేశవ్యాప్తంగా ఎఫ్ సిఐ  గోదాముల్లో తొమ్మిది కోట్ల టన్నుల ఆహార నిల్వలు ఉన్నాయి. మరోవైపు కరోనా దెబ్బకు ఉపాధి పోయిన కోట్లాది పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఈ నవంబర్ నెల తో ఉచిత రేషన్ ఆపేయాలని కేంద్రం నిర్ణయించడం అన్యాయం. గోదాముల్లో ఉన్న ఆహార నిల్వలను ఉపయోగించి మరికొంతకాలం ఉచిత రేషన్ అమలుచేయాలని ఆహార హక్కుల వేదిక కేంద్రానికి లేఖ రాసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: