భారతదేశం ఎందరో అసమాన వీరులకు జన్మనిచ్చిన భూమిగా విరాజిల్లుతుంది. చరిత్రలో అందరికి స్థానం లభించకపోవడానికి అనేక కారణాలు నాడు ఏమున్నాయో కానీ, నేటి ప్రభుత్వాలు ఆ చొరవ తీసుకుంటున్నాయి. ఇది ఆయా ప్రభుత్వాలలో ప్రశంసించదగ్గ గుణం. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం ఒకటి తీసుకుంది. ప్రస్తుత సంవత్సరం నుండి నాడు చిత్రదుర్గ కోటను రక్షించడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఒనికే ఓబవ్వ జయంతి ఉత్సవాలు జరిపేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అధికారపూర్వకంగా నిర్వహించనున్నారు. 18వ శతాబ్దంలో హైదర్ అలీ చిత్రదుర్గ ను ఆక్రమించడం కోసం ప్రయత్నిస్తే ఆతని సైన్యంపై ఓబవ్వ విరుచుకుపడింది. అప్పటి పోరాటాస్ఫూర్తి ఇప్పటికి అక్కడ కనిపిస్తూనే ఉంటుంది.

ఆమె కర్ణాటకలోని జానపద కధలలో ఇప్పటికి కనిపిస్తూనే ఉంటుంది. అక్కడి వారు సాహిత్యం, సినిమాలు, కళల ద్వారా ఆమెను ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం కర్ణాటకలోని చిత్రదుర్గ కోట ఒకనాడు మదార్కి నాయక్ పాలించాడు. అప్పటి కోట వైభవాన్ని చూసి హైదర్ అలీ దానిని సొంతం చేసుకోవాలని చూశాడు. దానికోసం ఎన్నో సార్లు నాయక్ పై దండెత్తాడు, ఎన్ని సార్లు ప్రయత్నించినా అలీకి కోట దరిదాపులలోకి రావడానికి కూడా వీలు కల్పించలేదు నాయక్. అంతటితో విసిగిపోయిన అలీ దొంగదెబ్బ తిసైనా కోటను స్వాధీనం చేసుకోవాలి అనుకున్నాడు. దానితో ఈసారి భారీగా సైన్యంతో కోట పైకి వచ్చాడు, రోజులు, నెలలు సాగింది పోరాటం. కోట లో వారికి తగినన్ని వనరులు, ఆహారం ఉంది కానీ అలీ వర్గానికి ఆ వనరుల లోటు కనిపిస్తుంది. దానితో ఆ వనరులు అయిపోయేలోగా ఏదైనా రహస్య మార్గం కోటలోకి వెళ్ళడానికి ఉందేమో అని ఆరా తీశాడు. అలీ కి ఒక మార్గం దొరికింది.

అంతటితో అలీ లో ఉత్సాహం పొంగిపొర్లడంతో, ఆ రహస్య మార్గం ద్వారా సైన్యాన్ని లోనికి చొప్పించడం ఆరంభించాడు. కానీ ఆ మార్గానికి కాపలా ఉన్నది ఓబా. అతడిని భోజనానికి పిలిచింది భార్య ఓబవ్వ. కానీ అన్ని వడ్డించి నీళ్లు పెట్టడం మరిచింది. దానికోసం బావి దగ్గరకు రాగా, అక్కడ అలీ సైన్యం చొరబడటం చూసింది. అంతే ఇంట్లోకి వెళ్లి ఆయుధం వెతకగా, రోకలి బండ మాత్రమే కనిపిస్తే దానిని తీసుకెళ్లి అలీ సైన్యాన్ని చొరబడిన వారిని చొరబడినట్టు రోకలి బండతో తలపై మోది చంపేస్తూ వచ్చింది. భార్య ఇంకా నీళ్లు తేవడం లేదని ఓబా బయటకు వచ్చి చూడగా అక్కడ శవాల కుప్ప కనిపించింది. ఓబవ్వ పట్టిన చెమటను తుడుచుకుంటూ ఒళ్ళంతా శత్రువుల రక్తంతో తడిచి కనిపిస్తుంది. అది చూసి ఇతర సైన్యాన్ని ఓబా  అప్రమత్తం చేసి, ఆ మార్గాన్ని తాత్కాలికంగా మూసేస్తారు. తరువాత రోజు రాజు ఓబవ్వ ను సభకు పిలిపించి, తాను సైనికుడి భార్యమాత్రమే కాదు, నేటి నుండి అందరికి తల్లి అని, తనను పూజించుకుంటాం అని కొనియాడారు. ఇప్పటికి ఆ రహస్యమార్గాని రోకలిబండ రహస్యమార్గం(వొంకేకండి) అని పిలుచుకుంటున్నారు కన్నడీయులు. చరిత్రలో ఇలాంటి వీరవనితలు ఎందరికో భారతదేశం జన్మనిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: