త‌ల్లీ తండ్రీ గురువూ దైవం ఒక‌ప్పుడు
త‌ల్లీ తండ్రీ గురువు అక్క‌ర్లేదు గూగుల్ ఉంటే చాలు
బిడ్డ‌ల ప్రేమ‌ను పొంద‌లేని త‌ల్లిదండ్రులు ఇప్పుడెంద‌రో! గూగుల్ ఉంటే చాలు ఇంకేం వ‌ద్దు అని చెప్పే డిజిట‌ల్ ఎడిక్ష‌న్ ఉన్న వారు ఎంత‌మందో! అయినా కూడా మా పిల్ల‌లు మాకు ముద్దు అని చెప్పేవారు ఉన్నారు లేండి. అది వేరే క‌థ! కానీ ఆధునిక కాలంలో బిడ్డ‌ల ప్రేమ‌ను పొంద‌లేని త‌ల్లిదండ్రుల క‌న్నా శాప‌గ్ర‌స్తులు ఎవ‌రు? అందుకే ఇదొక మోయ‌లేని భారం. క‌న్నామా పెంచామా వ‌దిలేశామా అని ఇవాళ అంతా అనుకుంటున్నారా లేదా బాధ్య‌త‌తోనే పిల్ల‌ల‌ను తీర్చిదిద్దుతున్నారా.. ఈ మితిమీరిన ముద్దు మురిపాల గోలేంటో?


ఆధునిక కాలంలో పిల్ల‌ల పెంప‌క‌మే పెను భారం.. పెద్ద శాపం కూడా! ఒక‌ప్ప‌టిలా పిల్ల‌ల‌ను పెంచ‌డం సాధ్యం కాని ప‌ని. టూ సెన్సి టివిటీ కొన్నిసార్లు..అతి ముద్దు..అతి మురిపెం కార‌ణంగా ఒక‌ప్ప‌టి క‌న్నా ఇప్పుడు పిల్ల‌లు మొండిగా త‌యార‌వుతున్నారు. స్కూళ్ల‌లో కూడా కేవ‌లం మార్కులు వాటి వెనుక ప‌రుగులు త‌ప్ప టీచ‌ర్ త‌ర‌ఫు నుంచి వ‌స్తున్న విలువ‌లు ఏవీ లేకుండా పోతున్నాయి. ఒక‌ప్పుడు టీచ‌ర్ ఓ రోల్ మోడ‌ల్. ఇప్పుడు టీచ‌ర్ రీల్ మోడ‌ల్ .

ఆన్ లైన్ క్లాసులు వ‌చ్చేశాక అస్స‌లు టీచ‌ర్ అంటే గౌర‌వం అన్న‌దే లేకుండా పోతోంది. ముఖ్యంగా పిల్ల‌లు కాస్త కూడా వారి ఉపాధ్యాయుల విష‌య‌మై మాట్లాడే మాటల్లో సంస్కారం అన్న‌దే పాటించ‌కుండా ఉంటున్నారు. ఇప్ప‌టి పిల్ల‌ల‌కు టెక్నాల‌జీ ఉన్న మ‌మ‌కారం బ‌డుల‌పై ఉండ‌డం లేదు. అస్స‌లు ఎవ్వ‌రినీ ప‌ట్టించుకోని నైజంతో పిల్ల‌లు ఇవాళ త‌ల్లిదండ్రుల‌కు స‌వాల్ గా మారుతున్నారు. చేతిలో అందుబాటులో ఉన్న టెక్నాల‌జీ కార‌ణంగా కొన్ని గంట‌లు అదే ప‌నిగా క‌ళ్ల‌ను డిజిట‌ల్ తెర‌ల‌కు అప్ప‌గిస్తున్నారు. ఇప్పుడు చూడ‌కూడ‌నివి చూడాల్సిన‌వి రెండూ ఒక్క‌టే అయిపోయాయి పిల్ల‌ల‌కు.


ఒక‌ప్పుడు త‌ల్లీ తండ్రీ అంటే గౌర‌వం ఆద‌రం ఉండేవి. ఇప్పుడు అవేవీ లేవు. అమ్మానాన్న‌ల‌ను గౌర‌వించే బ‌దులు న‌లుగురికీ అవ‌మానిస్తున్నారు. కొంత వ‌య‌సు వ‌ర‌కూ బాగానే ఉన్నా, తోటి వ్య‌క్తుల ప్ర‌భావంతో పూర్తిగా చెడిపోతున్నారు. మాన‌వీయ విలువ‌లు అన్న‌వి లేకుండా పోతున్నాయి. త‌మ‌కు జ‌న్మ‌నిచ్చారు క‌నుక పెంచాల్సిన బాధ్య‌త వారిదే అన్న విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: