అమ‌ర్ చిత్ర క‌థ ఆధారంగా త‌న క్రియేటివ్ థాట్ ను జోడించి సినిమా తీశాడు రాజ‌మౌళి. సినిమా పేరు బాహుబ‌లి. ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌ల సినిమా అంత‌కుమించి లాభాలు. మ‌న బాల‌ల క‌థ‌కు ఉన్న స‌త్తా ఇది. మ‌న చిన్ననాట అమ్మ‌మ్మ నేర్పిన  క‌థ‌ల‌కు ఉన్న వాల్యూ అది. ఇది క‌మర్షియ‌ల్ స‌క్సెస్ కొట్టింది క‌నుక చెప్పిన మాట కాదు. అది ఎలా ఉన్నా కూడా మ‌న క‌థ మ‌న జీవితం అంతా కూడా ఎన్నో రెట్లు ఉన్నత స్థాయికి చేరుకోవాల‌న్నా మ‌న జీవితాలు ఆనందాల‌కు ఆనవాలు కావాల‌న్నా కూడా మ‌నం ముందుకు పోవాల‌న్నా పోయి మంచి ఫ‌లితాలు అందుకోవాల‌న్న మ‌నకు కావాల్సింది అమ‌ర చిత్ర కథ‌లే.. బాల మిత్ర క‌థ‌లే ..మ‌న క‌థ‌ల‌కు కొన‌సాగింపే మ‌న సినిమాలు. మ‌నం నేర్చుకోవాల్సింది మూలాల‌ను.



మ‌నం దాచుకోవాల్సింది చంద‌మామ క‌థ‌ల‌ను. కానీ ఇవేవీ చేస్తున్నామా అంటే చేయం. మ‌న పిల్ల‌ల‌కు నేర్పుతున్నామా అంటే నేర్పం. మ‌నం మ‌న‌ది కాని జీవితాన్ని అనుభ‌విస్తూ ముందుకు పోతుంటాం. అదే జీవితంలో బాల్యం ఉంటుంది కానీ దానికో అర్థం ఉండ‌దు. అదే జీవితంలో జ్ఞాప‌కం ఉంటుంది కానీ అదెందుకూ ప‌నికి రాకుండా ఉంటుంది. ఇది రా జీవితం. న‌యా జీవితం. ద‌గా జీవితం.


చంద‌మామ క‌థ‌లో ప‌గ‌డ‌పు దీవులు ఉంటాయి. అవి ఊహ‌కు ఉదాహ‌ర‌ణ‌గా  ఉంటాయి. ఊహాలోకాలు అని అంటామే అవే ఇవి. ప‌గ‌డ‌పు దీవులు రెక్క‌ల గుర్రాలు ఒంటి క‌న్ను రాక్ష‌సుడు మాయ‌ల మాంత్రికుడు మాట‌లు నేర్చిన చిల‌క  ఇంకా ఇంకెన్నో ఇవ‌న్నీ మ‌న క‌థ‌ల్లో పాత్ర‌లు మ‌న జీవితాల్లో పాత్ర‌లు కానీ ఇప్పుడు అవి లేవు. ఉండ‌వు కూడా! మ‌న‌కొక యానిమేటెడ్ వ‌రల్డ్ కావాలి. అదే ప్ర‌పంచం అనుకుంటాం. మ‌న‌కొక వ‌ర్చువ‌ల్ రియాల‌టీ అన్న‌ది కావాలి. అదే మ‌న లోకం అనుకుంటాం.మ‌న‌కు ఆధారం గా తోచిన‌వేవీ  అక్క‌ర్లేదు. మ‌న ఫాంట‌సీ మ‌న యుద్ధ క‌థ మ‌న అక్బ‌ర్ బీర్బ‌ల్ క‌థ మ‌న మ‌ర్యాద రామ‌న్న, మ‌న పంచ‌తంత్ర క‌థ‌లు, మ‌న ప‌ర‌మానంద‌య్య క‌థ‌లు ఇవేవీ అక్క‌ర్లేదండి. ఏం కాదు ఇవేవీ నేర్పకుండానే మీ పిల్ల‌ల‌ను పెద్దాళ్ల‌ను చేయండి. ఏం కాదు ఇవేవీ నేర్ప‌కుండానే నీతి చంద్రిక‌లు అందించ‌కుండానే మీ పిల్ల‌ల‌ను ఐఏఎస్ లు చేయండి. ఏం కాదు వాళ్ల‌కు ఎవ‌రేంటో ఎందుకో తెలియ‌కుండానే జీవితం అర్థం అంద‌కుండానే కాలం గ‌డిచిపోతుంది. ఇలాంటి దౌర్భాగ్యం మ‌న బాల్యానిది దీనిని ఎవ్వ‌రూ ఏమీ అన‌వ‌ద్దండి.

మరింత సమాచారం తెలుసుకోండి: