భారతదేశం అంటే కుటుంబ వ్యవస్థ కు అత్యంత ప్రాధాన్యత ఉండేది ఒకప్పుడు. అప్పట్లో పిల్లలను కనడానికి కూడా పెద్దగా ఆంక్షలు ఉండేవి కావు. అందుకే ఒక్కొక్కరికి పదేసిమంది ఉండేవారు. ఇప్పటికి కొందరు తాతలు లేదా ముత్తాతలు ఉంటె వారి తోడబుట్టిన వాళ్ళను వారెపుడైన తలుచుకుంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని. కనీసంలో కనీసం 7 లేదా 8 మంది తోడబుట్టిన వాళ్ళు ఉండేవారు. వాళ్ళందరూ ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. ఒకరు అన్ని కుదిరి బాగా వృద్ధిలోకి వస్తే మిగిలిన వారిని కూడా పైకి లాగేసేవారు. అలా ఒక కుటుంబ వ్యవస్థ, బాధ్యత, ప్రేమానురాగాలు, అనుబంధాలు అనేవి ఉండేవి. ఇవన్నీ నాణేనికి ఒకవైపే కావచ్చు, బాధ్యత ఉన్నచోట కాస్త సర్దుకుపోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అలాగని నేనెందుకు సర్దుకుపోవాలి అనుకుంటే అక్కడ అనుబంధము నిలబడదు, కుటుంబం అనేది కూడా అసలు ఉండబోదు.

అప్పట్లో ఒక పండగ వస్తే అందరు కలిసేవాళ్ళు, అప్పుడు ఇళ్లు కూడా అలాగే ఉండేవి. పెద్ద పెద్ద కట్టడాలు, అందరికి సరిపోకపైనా ఉన్నదానితో ఆ పండుగ రోజులు గడిపేసి, సంతోషాలను మూటకట్టుకొని మళ్ళీ వారివారి ఊళ్లకు వెళ్లేవారు. అలాంటి ఘటనలు నేడు చూడాలన్నా మచ్చుకు ఒకటి కూడా కనిపించడం లేదు. ఎక్కడ చూడు పిల్లలు కూడా ఒకరో ఇద్దరో. అంతకంటే వల్లకాని ఆరోగ్యాలు, ఆర్దికపరిస్థితులు. పెద్దలే కాసేపు పనిచేయలేని స్థితిలో ఉండటంతో పిల్లలు కూడా ఉసూరుమంటూ ఉంటారు. కాస్త వాతావరణం మారితే చాలు ఆరోగ్య సమస్యలు. ఇందులో కూడా మళ్ళీ లేటు వివాహాలు, కొందరు సెటిల్ అవ్వాలి అంటూ పెళ్లిని పక్కన పెడుతున్నారు, మరికొందరు అసలు పెళ్ళొద్దు బాబోయ్ అంటూ పారిపోయినంత పని చేస్తున్నారు.  

ఇలాంటి వారిని ఒప్పించి పెళ్లి చేసే సరికే పిల్లలు పుట్టే వయసు కాస్తా దాటిపోతుంది. దీనితో సంతానం లేమి దంపతుల సంఖ్య రానురాను పెరిగిపోతుంది. ఏ కారణమైనా కూడా దేశంలో పెళ్లిళ్లు తగ్గిపోతున్నాయి, అయినా పిల్లలు లేకుండాపోతున్నారు కాబట్టి, భవిష్యత్తులో ఒక తరం కనిపించకుండా పోయే ప్రమాదం బాగా కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్న నివేదికల ప్రకారంగా పిల్లల సంఖ్య బాగా తగ్గిపోతుందని తేల్చింది. చూడటానికి దేశంలో జనాభా బాగా ఉండొచ్చు కానీ అందులో యువతకానీ, రేపటి తరాలు కానీ లేకపోతే దానిని పెద్దగా విలువ ఉండదు. గతంలో చైనా లో కూడా ఇదే సమస్య వచ్చింది, ఆ దేశంలో కూడా ఎక్కువ ముసలివారు తప్ప మరో తరం కనిపించలేదు. దీనితో పిల్లలను కనడంపై ఆంక్షలు అన్ని ఎత్తివేశారు. ఇలాంటి పరిస్థితి భారత్ లో కూడా వస్తుండొచ్చు అంటున్నారు నిపుణులు. పిల్లలను కనండి అని పారితోషకాలు కూడా ప్రకటించే స్థాయికి రోజులు వచేస్తున్నాయని వారు అంటున్నారు. దానికి తగ్గిపోతున్న వివాహాలు, వివాహం పట్ల యువతలో పెరిగిపోతున్న వ్యతిరేక భావాలు ప్రధాన కారణం. లేటు వయసులో కూడా పెళ్లి కారణంగా పిల్లల ను కనే వయసు దాటిపోతుండటం కూడా మరో ప్రధాన కారణం. ఇవన్నీ కొనసాగేట్టుగానే ఉన్నాయి తప్ప, మార్పులు వచ్చే స్థితి కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: