దేశం ఎంతగా ముందుకు పోతుందో మరో ఘటన స్పష్టం చేసింది. సమసమాజంలో రేపటి పౌరులు ఎంతగొప్పగా మార్గదర్శనం పొందుతున్నారో ఈ ఘటన గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కానీ ఇది నేడు చర్చనీయాంశం అవుతుంది అంతే. గతంలో ఇలాంటివి లేవని కాదు, ఇది చదివిన తరువాత ఆగిపోతాయని కాదు. మన ఉరుకులు పరుగులు ఎక్కడివరకు సమాజ నిర్మాణం చెడగొడుతున్నది తెలిసొస్తుంది. అప్పుడప్పుడైనా కొన్ని నిజాలు ఒప్పేసుకుంటే అదే మనశాంతి. శాస్త్రాలలో చెప్పినట్టుగా దేవుడి దగ్గరకు వెళ్లి, స్వామి ఇప్పటివరకు చాలా తప్పులు చేసేశాను, క్షమించి రక్షించు అని ప్రార్థన చేసేయడం లేదు, ఇది అలాగే. ఇంతవరకు వచ్చినా మనం మారము. అది అందరికి తెలిసిన నిజమే. సమాజం ఎప్పుడో తెగిన గాలిపటం అయిపోయింది, అది రేపటి పౌరుల భవితవ్యాన్ని నిర్మిస్తుందన్న నమ్మకం వాళ్లలో కూడా పోయింది.

చిన్నతనంలో అబద్దం తప్పు అంటారు, వాళ్ళు అబద్దం ఆడుతుంటే, అప్పుడప్పుడు ఆడొచులేవోయ్ అని సర్ది చెప్పుకుంటారు. ఇలా మొదలైన కన్ఫ్యూషన్ అలా వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేవరకు ఉంటుంది. ఒకటి వద్దంటారు, వాళ్ళు మాత్రం చేస్తారు. కాస్త పెద్దయ్యాక సిగరెట్ తాగుతుంటారు, అది చూసి ఇదేమి అలవాటు అంటారు. కానీ రోజు వాళ్ళు తాగుతుంటేనే పిల్లలకు అదో గొప్పగా అనిపించి తాగాలని మనసులో కోరిక పుడుతుంది, అంతే దానికి దారులు వెతుక్కొని అవకాశం వస్తే అనుకున్నంత చేసేస్తారు. ఇది సమాజంలో కనీస ఘటనలు గురించి మాట్లాడుకుంటే, పరిస్థితి. ఇంకా చెప్పుకోవడానికి చాలనే ఉన్నాయి, ఆ చండాలం అంతా ఎందుకు అని పైపైన చిన్న చిన్నవి మాత్రమే చెప్పడం జరిగింది.

తాజాగా ఘటన విషయానికి వస్తే, తండ్రి మంచి తాగుబోతు. తాగుతాడు, చిందేస్తాడు, ఇంటికొచ్చి చక్కగా తూలుతూ, మంచి సంస్కారవంతమైన మాటలు మాట్లాడుతూ, బిడ్డలు ఉన్నారనే సోయ మరిచి, భార్యతో లేనిపోని ముచ్చట్లు చెపుతారు. అబ్బో, మందేసి చిందేస్తే ఆ మజానే వేరు అనే ఆలోచన ఆ వేషాలు చూసే వాళ్లకు కూడా అనిపించక మానదు. అదే బిడ్డకు అనిపించింది, అవకాశం కోసం చూశాడు. దానికి ముందు నగదు కావాలి, తలా కాస్త వేసుకోవచ్చు, సందర్భం కావాలి. దానికి ఒక సెలవు రోజు దొరికితే సరిపోతుంది. అవన్నీ కుదిరినట్టే ఉన్నాయి, చక్కగా కావాల్సిన బ్రాండ్ తెచ్చుకున్నారు, పాఠశాలలోనే మందేసి చిందేసి సరదా తీర్చేసుకున్నారు. ఇదంతా తెలిసిన బడి పంతులు వాళ్ళ సరదాను అర్ధం చేసుకోకుండా టీసీ ఇచ్చి పంపేశారు. టీసీ పిల్లలకు ఇవ్వాళా లేక ఆ బుద్ధి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలా, ఇక్కడ రేపటి తరాలకు అడ్డు ఎవరు అనేది సమసమాజం ఆలోచించుకోవాలి. ఒక మైనర్ కు కూడా స్త్రీ అంటే తెలిసిపోతున్న సమాజంలో ఉంటున్నారు, వాళ్లలో కాస్త ధైర్యం తెగిస్తే, జరిగేవి నేరాలే. వాళ్లకు ఉరేసి, రేపటి తరాలను మనమే నాశనం చేసుకుంటున్నాం. సమాజానికి శిక్ష ఏమిటో తెలుసా, ఇలాంటి మురుగులో కూడా బ్రతికే ఉండటం. మురుగులో ఎవరు నివసిస్తారో తెలుసా, అయితే మారడానికి కృషి చేద్దాం, తరువాతి తరాలకు మురుగు కాకుండా స్వచ్ఛమైన నేలను ఇద్దాం!

మరింత సమాచారం తెలుసుకోండి: