ఇప్పుడున్న హస్యనటుల క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవలసిన అవసరం లేదు,కాని పాతతరం హస్యనటుల కోసం తెలుసుకుంటే మాత్రం ఇప్పటి నటుల ప్రవర్తన కాని గుణం కాని అసలు నచ్చవు.ఇక పాతతరం తెలుగు చలనచిత్ర రంగంలో రెండు దశాబ్దాల పాటు ప్రముఖ హాస్యనటునిగా వెలిగి"శతాబ్దపు హాస్య నటుడి"గా ప్రసంశలు అందుకొన్న గొప్పవ్యక్తి.రాజబాబు.. అక్టోబర్ 20,1935వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో పుట్టిన రాజబాబు పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు.తల్లిదండ్రులు శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు మరియు శ్రీమతి రవణమ్మ.ఈయన నిడదవోలు పాఠశాలలో చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారి దగ్గర శిష్యరికం చేసారు.ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడుగా కొద్దికాలం పనిచేశాడు.ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే పలు నాటకాలలో పాలుపంచుకొనేవాడు.



ఒకసారి నాటకంలో రాజబాబును చూసిన గరికపాటి రాజారావు సినిమాలలో చేరమని ఉత్సాహపరిచాడు.దాంతో చెప్పాపెట్టకుండా 1960 ఫిబ్రవరి7న మద్రాసు చేరుకొన్నాడు.స్వగామం వదిలి రానైతే వచ్చాడు కాని పూట గడవకపోవడంతో అప్పటి హస్యనటుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ప్రైవేటు క్లాసులు చెప్పడం మొదలుపెట్టాడు.అలా కొన్నాళ్ళ తరువాత అడ్డాల నారాయణరావు"సమాజం"సినిమాలో రాజబాబుకి అవకాశం కల్పించాడు.అలా మొదటి సినిమా తరువాత తండ్రులు-కొడుకులు,కులగోత్రాలు,స్వర్ణగౌరి,మంచి మనిషి"మొదలగు చిత్రాలలో వరుసగా అవకాశాలు వచ్చాయి.స్వర్ణగౌరి చిత్రానికి గాను 350 రూపాయలు పారితోషికంగా మొదటి సారి స్వీకరించాడు.



ఇక మొదటి చిత్రం విడుదల తరువాత వచ్చిన చిన్నచిన్న పాత్రలలో నటిస్తూనే"కుక్కపిల్ల దొరికిందా","నాలుగిళ్ళ చావిడి","అల్లూరి సీతారామరాజు"మొదలగు నాటకాలు వేశాడు.జగపతి ఫిలింస్ వి.బి.రాజేంద్రప్రసాద్ చ్రిత్రం "అంతస్తులు" లో నటించినందుకుగాను మొట్టమొదటి సారిగా 1300 రూపాయలను పెద్ద పారితోషికంగా పొందాడు.తరువాత వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా వరుసగా ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించిన ఎన్నో చిత్రాలలో నటించాడు.సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వించిన రాజబాబు నిజజీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవాడు.ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటీ,నటుల్ని సత్కరించే వాడు.



రాజబాబుచే సత్కారం పొందిన వారిలో డా.శివరామకృష్ణయ్య, సూర్యకాంతం,సావిత్రి,రేలంగి మొదలగు ప్రముఖులు ఉన్నారు.అంతేకాకుండా ఎన్నోఎన్నెన్నోసంస్థలకు విరాళాలివ్వడంతోపాటు రాజమండ్రిలో చెత్తాచెదారం శుభ్రపరిచే వాళ్ళకు అదే ఊరిలోని దానవాయిపేటలో భూమి కూడ ఇచ్చాడు.అంతే గాక కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించాడు.డిసెంబరు 5వ తారీఖు 1965న లక్ష్మీ అమ్ములు ను వివాహమాడిన రాజబాబుకు నాగేంద్రబాబు,హేశ్ బాబు అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు.ఇంతటి మహానటుడు ఎన్నెన్నో అవార్డులు రివార్డులూ పొందిన గొప్ప హస్యనటుడు  ఫిబ్రవరి 14,1983న తెలుగు సినీ అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి స్వర్గస్తుడయ్యాడు...

మరింత సమాచారం తెలుసుకోండి: