హైద‌రాబాద్‌లో ఘోరం జ‌రిగింది. అధికారుల నిర్వాకం మూలంగా ఓ చిన్నారి చావుబ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మ్యాన్‌హోల్లో ప‌డి చిన్నారి ప‌రిస్థితి విష‌మించిన ఉదంతం ప‌లువురిని క‌ల‌చివేస్తోంది. హైద‌రాబాద్ గుడి మ‌ల్కాపూర్‌లో ఈ దారుణం జ‌రిగింది. ప‌దకొండు నెల‌ల‌ చిన్నారి దీక్షిత్ ప్ర‌స్తుతం నీలోఫ‌ర్‌లో చికిత్స పొందుతున్నాడు. 


గుడి మ‌ల్కాపూర్‌లో నివ‌సించే ఓ పేద కుటుంబం త‌మ దైనందిన ప‌నుల్లో నిమ‌గ్న‌మై ఉండ‌గా వారి కుమారుడు దీక్షిత్ ఆరుబ‌య‌ట ఆడుకుంటున్నాడు. ఇలా అడుకుంటున్న స‌మ‌యంలోనే ఆయ‌న ముందుకు వెళ్లి స‌మీపంలోని మ్యాన్‌హోల్‌ను తాకాడు. దీంతో ఒక్క‌సారిగా మ్యాన్‌హోల్ కుంగిపోయి బాలుడు అందులో ప‌డిపోయాడు. స్థానికంగా ఉన్నవారు గ‌మ‌నించి హుటాహుటిన ఆ బాలుడిని ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే, అప్ప‌టికే ఆ బాలుడు మ్యాన్‌హోల్‌లో ప‌డి ఆ వాయువుల‌ను పీల్చ‌డంతో ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది. దీంతో గుడిమ‌ల్కాపూర్‌ స‌మీపంలోని నిలోఫ‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం చికిత్స కొన‌సాగుతోంది. అయితే, బాలుడి ప‌రిస్థితి ఒకింత సీరియ‌స్‌గా ఉంద‌ని తెలుస్తోంది.


కాగా, ఈ దారుణ సంఘ‌ట‌న‌పై స్థానికులు మండిప‌డుతున్నారు. మ్యాన్‌హోల్ ప్ర‌మాద‌క‌రంగా మారింద‌ని, వెంట‌నే దానికి మ‌ర‌మ్మ‌త్తులు చేయాల‌ని తాము అనేక మార్లు జీహెచ్ఎంసీ అధికారుల‌ను కోరిన‌ప్ప‌టికీ స్పంద‌న లేద‌ని పేర్కొంటున్నారు. వ‌ర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర‌య్యే ప‌రిస్థితిలో కూడా జ‌ల‌మండలి, గ్రేట‌ర్ అధికారులు ప‌ట్టీప‌ట్ట‌న‌ట్లుగా ఉండిపోయార‌ని ఆరోపిస్తున్నారు. ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్నారి అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల మ్యాన్‌హోల్‌లో ప‌డిపోయి ప్రాణాపాయ స్థితికి చేర‌డంపై ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని స్థానికులు నిల‌దీస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: