అర‌టిపండు...పేదలకు తక్కువ ధరలకు లభించే పండ్లు. ఆరోగ్య‌వంత‌మైన‌వి కూడా. ఆకలేస్తే రెండు అరటి పండ్లు కొనుక్కుని తింటే కడుపు నిండిపోతుంది. ఇక రైల్లో ప్రయాణించేటప్పుడు ఏవి ఉన్నా లేకున్నా దగ్గర అరటి పండ్లు ఉంటే ఆకలి సమస్యే ఉండదు. అయితే, రైల్వేస్టేషనులో అరటిపండ్ల విక్రయాన్ని నిషేధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన వింత ఘటన ఉత్తరప్రదేశ్  లక్నోలోని చార్‌ బాగ్ రైల్వేస్టేషనులో జరిగింది. 


రైల్వే ప్లాట్ ఫామ్ లపై అరటి పండ్లు వ్యాపారులు అమ్ముతుంటారు. వాటిని ప్రయాణీకులు కొనుక్కోవటం అంతా సర్వసాధారణం. కానీ చార్ బాగ్ రైల్వే స్టేష‌న్‌లో అమ్మ‌కాలు నిషేధించారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైనా అరటిపండ్లను విక్రయిస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. చార్ బాగ్ రైల్వేస్టేషనులో అరటిపండ్ల విక్రయం వల్ల స్టేషను ప్లాట్ ఫాంలపై చెత్త పెరుగుతుందని, అందుకే వీటి విక్రయాలను నిషేధించామని అధికారులు తెలిపారు. 


 అరటిపండ్ల విక్రయ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ బోర్డు కూడా పెట్టారు. దీంతో  అరటిపండ్ల వ్యాపారులు విస్తుపోయారు. అధికారులు తమ పొట్టకొడుతున్నారంటూ వాపోతున్నారు. అరటి పండ్ల అమ్మకాలపై నిషేధం విధించటంలో ప్రయాణీకులతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అరటిపండ్ల అమ్మకాల వల్ల చెత్త పేరుకుపోతోందనే మాట నిజమైతే దానికి ప్రత్యామ్నాయం చూడాలి గానీ ఇటు చిరువ్యాపారులను..అటు ప్రయాణీకులను ఇబ్బంది పెట్టటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఒక‌వేళ‌, ఇదే ఆలోచ‌న‌ను అన్ని రైల్వే స్టేష‌న్ల‌లో అమ‌లుచేస్తే...ఇక రైల్వే స్టేష‌న్ల‌లో అర‌టిపండ్లు తిన‌లేమ‌ని కొంద‌రు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: