హోటళ్లలో భోజనం ఎంత ప్రియంగా ఉంటుందో తెలిసిందే. అయితే, ఆ బామ్మగారు కేవలం రూ.1కే ఇడ్లీ విక్రయిస్తున్నారు. అది కూడా జీఎస్టీ లేకుండా!! ఫైవ్ స్టార్ హోటళ్లు లగ్జరీ పేరుతో జత అరటి పండ్లను రూ.450కు, ఉడికించిన రెండు గుడ్లను రూ.1700కు అమ్మేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇడ్లీ తదితర అల్పాహారాలు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. ఇక సాధారణ హోటళ్లలో కూడా టిఫిన్ ధరలు బాగా పెరిగిపోయాయి. కనీసం రూ.20 చెల్లిస్తే గానీ రెండు ఇడ్లీలు రావడం లేదు. అయితే, ఈ బామ్మగారి హోటల్‌లో మాత్రం ఇడ్లీ కేవలం రూ.1 మాత్రమే.


తమిళనాడులోని వడివేలంపాల్యంలో నివసిస్తున్న కె.కమలతాల్ 30 ఏళ్ల నుంచి ఇడ్లీలు అమ్ముతోంది. 80 ఏళ్ల వయస్సులోనూ ఆమె ఉదయాన్నే నిద్రలేచి, పిండి రుబ్బి ఇడ్లీల తయారీలో నిమగ్నం అవుతోంది. పదేళ్ల కిందట ఆమె ఒక్కో ఇడ్లీ 50 పైసలకు మాత్రమే అమ్మేది. అయితే, 50 పైసల చెలామణి తగ్గడంతో ఆమెకు ఇడ్లీ ధరను రూ.1కు పెంచక తప్పలేదు. నిత్యవసర వస్తువులు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో ఇడ్లీ ధర పెంచాలని చాలామంది సూచించారు. ఇందుకు ఆమె అంగీకరించలేదు.


కమలతాల్ ఉమ్మడి కుటుంబంలో జీవించేది. అప్పట్లో ఆ ఇంట్లో అందరికీ ఆమె వంటలు చేసేది. కుటుంబ సభ్యులంతా ఉపాధి పనుల కోసం వేర్వేరు గ్రామాలు, పట్టణాలకు తరలిపోవడంతో కమలతాల్ తన ఊరిలోనే ఇడ్లీలు విక్రయిస్తూ జీవిస్తోంది. ఇడ్లీ ధరలు పెంచితే ఆమెకు మంచి ఆదాయమే వస్తుంది. కానీ, ఆ ప్రాంతంలో నివసిస్తున్న పేదలు రూ.15 నుంచి రూ.20 చెల్లించడం కష్టమని, వారి కోసమే తక్కువ ధరకు ఇడ్లీలను విక్రయిస్తున్నా అని ఆమె తెలిపింది. ఏదీ ఏమైనా.. లాభాలు ఆశించకుండా పేదల కోసం నిజాయతీగా వ్యాపారం చేస్తు్న్న ఈ బామ్మగారికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే!


మరింత సమాచారం తెలుసుకోండి: