రోజూ మాదిరిగానే ఈరోజు నేను నిద్ర లేచాను. సూర్యుడి కిరణాలు బలంగా నా మొహాన్ని తాకుతున్నాయి, కళ్ళు పూర్తిగా తెరుపుడుపడడం లేదు. ఏదో శక్తి నన్ను గుంజుతున్నట్లు అనిపిస్తోంది. అయ్యో! అప్పుడే ఎనిమిది అయిందా, ఆఫిస్ కి లేట్ గా వెళితే మా బాస్ కోప్పడతాడు, దివ్యా! నా కాఫీ ఎక్కడ. ఏంటో, ఎంత అరుస్తున్నా దివ్య నా మాట వినిపించుకోవడం లేదనుకుని, చివరికి ఎలాగో లేచి నిల్చున్నాను. మా ఇంటి బయట ఒకటే జనం, తీరా పరికించి చూస్తే అక్కడ ఎవరో చనిపోయినట్లు అర్ధం అయింది. ఆ ప్రక్కనే నా భార్య దివ్య, నా కొడుకు అర్జున్ ని పట్టుకుని భోరున విలపిస్తోంది. మరోవైపు నాతో ఏడాది క్రితం గొడవ పడ్డ కృష్ణ కూడా ఏడుస్తున్నాడు, ఇంకోవైపు మా అమ్మ నాన్నలు కూడా కుమిలిపోతున్నారు. ఓరిదేవుడా! తీరా పరికించి చూస్తే అక్కడున్నది నా శవమే. అసలు ఏంటిది, ఏమిజరుగుతోంది అనేది నాకు ఏ మాత్రం అర్ధం కాలేదు. ఒకసారి ఆలోచిస్తే, అప్పుడు అర్ధం అయిందేంటంటే, నిన్న రాత్రి సడన్ గా నాకు గుండెల్లో  కొంత నొప్పిగా అనిపించింది, అలాగే గుండెపట్టుకుని గట్టిగా అరావాలనుకున్నా, కానీ నోట మాట రాలేదు. దాని తరువాత నాకు ఏమి తెలియలేదు. అంటే దాన్ని బట్టి నిన్న రాత్రే నేను చనిపోయానని అర్ధం అయింది.  నా భార్య బిడ్డలు, మిత్రుడు, తల్లితండ్రులు నా కోసమే ఏడుస్తున్నారు అని తెలిసి విపరీతంగా బాధపడ్డాను. 

ఓ భగవంతుడా! అప్పుడే నన్ను నీ వద్దకు రప్పించుకున్నావా అనుకుని లోలోపల ఏడుస్తూ అప్పుడే అసలు తప్పు తెలుసుకున్నాను. ఇన్నాళ్లు ఎంతో కష్టపడి పని చేసి డబ్బు సంపాదించానే గాని, ఏనాడూ నా భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకుని నీ వంటి అర్ధం చేసుకునే చక్కటి ఇల్లాలు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పాలని అనుకున్నాను, ఇక నా బిడ్డను చూసి నువ్వు పుట్టడం నిజంగా మాకు ఒక గొప్పవరం అని చెపుదాం అనుకున్నాను, ఇక నా మిత్రుడు కృష్ణతో ఒరేయ్! నన్ను క్షమించరా, సంవత్సర కాలంగా నీతో లేని పోని ఇగోలకు పోయి స్నేహాన్ని చెడగొట్టుకున్నాను అని చెప్పాలని ఉన్నా ఎవ్వరికీ చెప్పలేకపోయాను. ఇక చివరకు నా తల్లితండ్రులతో, మీలాంటి వారు నాకు తల్లితండ్రులుగా దొరకడం నా అదృష్టం, మీ రుణాన్ని జన్మ జన్మలకు తీర్చుకోలేను అని అమ్మ ఒడిలో తలపెట్టి పడుకోవాలని, వారికి సేవ చేయాలని ఉండేది. కానీ ఇవన్నీ చేయకుండానే నేను అర్ధంతరంగా చనిపోయాను. ఓ దేవుడా! నాకు కాస్త సమయం ఇవ్వవయ్యా! నా తప్పులు నేను తెలుసుకున్నాను, నన్ను క్షమించు అని గట్టిగా అరుస్తుండగా, ఎవరో నన్నుగట్టిగా కొడుతున్న భావన కలుగుతోంది. ఒక్కసారిగా కళ్లుతెరిచి ఉలిక్కిపడి చూడగా, నాముందు నా భార్య దివ్య, కొడుకు అర్జున్, మా అమ్మ భార్గవి నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. ఏంటండీ, పొద్దున్నే నిద్రలో అలా కలవరిస్తున్నారు అని దివ్య అంటే, ఏంటిరా ఏదైనా కలగన్నావా అంటూ అమ్మ అడిగింది. అప్పుడు అర్ధం అయింది, ఇప్పటివరకు నేను కలవరించింది కలలో అని. 

వెంటనే, నా భార్య, బిడ్డలను, నా తల్లిని ఒక్కసారి దగ్గరకు తీసుకుని, ఈ జన్మలో మీరందరూ నావారు కావడం నిజంగా నా అదృష్టం. అమ్మా, నిన్ను కానీ, దివ్యను కానీ ఇప్పటివరకు ఏదైనా ఇబ్బంది పెట్టివుంటే క్షమించండి అని అనగానే వారిద్దద్దరూ ఒక్కసారిగా ఏడ్చేశారు. వారిని చూసిన నా కళ్ళు కూడా పూర్తిగా చెమర్చాయి. వెంటనే నా ఫ్రెండ్ కృష్ణ కు కూడా కాల్ చేసి, ఒరేయ్ నన్ను క్షమించరా, సాయంత్రం ఇద్దరం కలుద్దాం అనగానే ఫోన్ లోనే వాడు ఏడ్చేశాడు. అయినా ఇలా జరగడం కూడా ఒకరకంగా నాకు కను విప్పుకలిగించినట్లయింది. ఎందుకంటే మనలో కూడా చాలామంది తమ ఇగోలకు, కోపాలకు పోయి మనవారిని దూరం చేసుకుంటుంటారు. నిజానికి ఎప్పుడు, ఎవరికి, ఏమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి, కాబట్టి మీరందరూ మీవారిని ఎప్పుడూ ఇబ్బందిపెట్టేలా వ్యవహరించవద్దు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, కేవలం రెప్పపాటే ఈ జీవితం అనే ఒక మహానుభావుడు చెప్పిన విషయాలు ఎప్పుడూ మన మనసులో గుర్తుపెట్టుకుని, జీవితం యొక్క విలువ తెలుసుకుని ముందుకు సాగాలని ఏదో మా వంతుగా చేస్తున్న మనవి. డబ్బులు, ఆభరణాలు, ఆస్తులు, వస్తువుల వంటి వాటన్నిటికంటే కూడా మనవాళ్ళు, అదేనండీ మన అని అనుకునే వాళ్ళు అంతకంటే ముఖ్యం. కాబట్టి వారిని ఇబ్బంది పెట్టవద్దు, వారి కోసం మన ఇగోలను, కోపాలను అదుపులో పెట్టుకుని, ఈ చిన్న వేదనను అర్ధం చేసుకుని మీమీ జీవితాలను ఆనందంగా ముందుకు నడపండి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: