గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం...ధూళిపాళ్ళ ఫ్యామిలీకి కంచుకోట. దశాబ్దాల పాటు టీడీపీలో రాజకీయం చేస్తున్న ఈ ఫ్యామిలీకి పొన్నూరులో తిరుగులేదు. 1983, 85, 89 ఎన్నికల్లో ధూళిపాళ్ళ వీరయ్య చౌదరీ హ్యాట్రిక్ విజయం సాధిస్తే, ఆయన తనయుడు ధూళిపాళ్ళ నరేంద్ర 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి, 2019 ఎన్నికలో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నారు.


కానీ ఊహించని విధంగా జగన్ గాలిలో నరేంద్ర విజయాలకు బ్రేక్ పడిపోయింది. వైసీపీ తరుపున వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్య స్వల్ప మెజారిటీతో నరేంద్రని ఓడించారు. అయితే దశాబ్దాల పాటు టీడీపీ హ్యాండ్ లో నడిచిన పొన్నూరు తొలిసారి వైసీపీ హ్యాండ్ లోకి వచ్చేసింది. ఎన్నో భారీ అంచనాల మధ్య గెలిచిన రోశయ్య, ఆ అంచనాలకు తగ్గట్టుగానే పనిచేస్తున్నారా? అంటే కాస్త అవుననే చెప్పొచ్చు.

రోశయ్య ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి ప్రభుత్వ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి, వాటిని అర్హులకు అందేలా చేస్తున్నారు. అయితే ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పథకాలు మినహా ఇక్కడ చెప్పుకోదగిన అభివృద్ధి ఏం జరగలేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి మంచి ఫలితాలే వచ్చాయి. అధికారంలో ఉండటం, జగన్ అందిస్తున్న పథకాలు రోశయ్యకు బాగా కలిసొచ్చింది.


అయితే తాజాగా సంగం డైరీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏసీబీ, ధూళిపాళ్ళని అరెస్ట్ చేసింది. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగానే నరేంద్రని అరెస్ట్ చేసిందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక సంగం డెయిరీలో దొంగ సర్టిపికెట్లతో 70 ఎకరాలకు పైగా భూమి దోచుకున్నారని, సంగం డెయిరీ పేరిట దొంగ సర్టిఫికెట్లు సృష్టించి దోపిడీ చేశారని ధూళిపాళ్ళపై రోశయ్య మండిపడుతున్నారు. అందుకే ధూళిపాళ్ళని అరెస్ట్ చేశారని చెబుతున్నారు. అయితే ఈ ధూళిపాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల రోశయ్యకు ఎంత ప్లస్ అవుతుందో చూడాలి. ఒకవేళ రివర్స్ అయ్యి, ఈ అరెస్ట్ ధూళిపాళ్ళపై సానుభూతి పెరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: