వేముల ప్రశాంత్ రెడ్డి....కేసీఆర్‌కు వీర విధేయుడు...వేముల సురేందర్ రెడ్డి రాజకీయ వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు. సురేందర్ రెడ్డి సైతం టీఆర్ఎస్‌లో కీలకంగా పనిచేసిన నేత. అలాగే గతంలో ఈయన నిజాం సుగర్స్ సంఘం అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. ఇక తండ్రి బాటలోనే ప్రశాంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. వృత్తి పరంగా బిల్డర్ అయిన ప్రశాంత్...గోదావరి పుష్కరాలు, కేసీఆర్ నిర్వహించిన చండీయాగం పనులని దగ్గర ఉండి చూసుకున్నారు.

అలా కేసీఆర్‌కు దగ్గరైన ప్రశాంత్ రెడ్డి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున బాల్కొండలో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. అలాగే 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా ప్రశాంత్ రెడ్డి మళ్ళీ బాల్కొండలో మంచి మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇలా రెండోసారి ఎమ్మెల్యే అయిన ప్రశాంత్‌కు విధేయత మంత్రి పీఠం ఎక్కేలా చేసింది. 2019లో ప్రశాంత్‌కు కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా అవకాశం దక్కింది. కీలకమైన రోడ్లు, భవనాల శాఖ దక్కింది.

ఇక మంత్రిగా ప్రశాంత్ రెడ్డి దూకుడుగా ముందుకెళుతున్నారు...ఎలాగో బిల్డర్, పైగా బీటెక్‌లో సివిల్ ఇంజినీర్ చదివారు. దీంతో తన శాఖపై త్వరగా పట్టు తెచ్చుకుని, మంత్రిగా మంచి మార్కులే కొట్టేస్తున్నారు. అటు ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడంలో ముందున్నారు. అలాగే తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగంగా చేయిస్తున్నారు. సి‌సి రోడ్లు, వాటర్ ట్యాంకులు, రైతు మార్కెట్లు ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నారు.


ఇక రాజకీయంగా చూస్తే బాల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రజా మద్ధతు ఎక్కువగా ఉంది. రాజకీయంగా ప్రశాంత్ రెడ్డికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ కాంగ్రెస్ తరుపున ఎరవర్తి అనిల్ కుమార్ పనిచేస్తున్నారు...అయితే అనిల్‌కు రాజకీయంగా గ్రిప్ రాలేదు. అదే సమయంలో ఇక్కడ బీఎస్పీ పార్టీ స్ట్రాంగ్‌గా ఉంది. గత ఎన్నికల్లో బీఎస్పీ పార్టీపైనే ప్రశాంత్ గెలిచారు. అయితే ఇక్కడ కాంగ్రెస్, బీఎస్పీలు కలిసి పోటీ చేస్తే...ప్రశాంత్‌కు ఇబ్బంది. లేదంటే బాల్కొండలో ప్రశాంత్ కారు స్పీడుకు బ్రేకులు వేయడం కష్టమే.


మరింత సమాచారం తెలుసుకోండి: