తెలంగాణ‌లో భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కేంద్ర‌మైన కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు నాలుగు ద‌శాబ్దాలకు పైగా రాజ‌కీయం చేస్తున్నారు ప్ర‌స్తుత ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు. 1989, 1999, 2004, 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి విజ‌యం సాధించిన ఆయ‌న ఆ త‌ర్వాత గ‌త 2018 ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి జంప్ చేసేశారు. మ‌ధ్య‌లో 1994లో కాంగ్రెస్ నుంచి ఓడిపోగా, 2009లో ఓడిపోయారు. 2014లో పొత్తులో భాగంగా సీటును సీపీఐకు ఇవ్వ‌డంతో ఆయ‌న వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంత‌కు ముందు 1978లో సైతం వ‌న‌మా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి చేకూరి కాశ‌య్య చేతిలో ఓడిపోయారు. ఇక ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతోన్న వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు పార్టీ మారినా నియోజ‌క‌వ‌ర్గానికి అభివృద్ధి ప‌రంగా ఒరిగిందేమి లేద‌న్న‌ది నిజం.

 

అయితే కొత్త‌గూడెంలో క‌రోనా ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న ఈ వ‌య‌స్సులోనూ చాలా యాక్టివ్‌గానే తిరుగుత‌న్నార‌ని చెప్పాలి. ఇటీవ‌ల త‌న ఇంట్లో వివాహాం కోసం ఏకంగా 40 వేల‌కు పైగా కార్డులు పంచి కూడా ఆయ‌న క‌రోనా నేప‌థ్యంలో వివాహం ర‌ద్దు చేసుకోవ‌డంతో సీఎం కేసీఆర్ సాక్షాత్తు అభినందించారు. క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో కొత్త‌గూడెం రెడ్‌జోన్లో ఉండ‌డంతో ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు ఆయ‌న ప‌డుతోన్న క‌ష్టాన్ని ప్ర‌శంసించాల్సిందే. అయితే పార్టీ మారినా అభివృద్ధి ప‌రంగా ప్ర‌త్యేక‌మైన నిధులు అయితే రాలేదు. నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త‌గూడెం, పాల్వంచ మున్సిపాల్టీలు ఉన్నా ఇక్క‌డ కొత్త ప‌నులు లేవు.

 

రాజ‌కీయంగా తిరుగులేని బ‌లం:
రాజ‌కీయంగా చూస్తే నియోజ‌క‌వ‌ర్గంలో ఐదు మండ‌లాలు ఉండగా ఐదు ఎంపీపీలు, ఐదు జ‌డ్పీటీసీలు అన్ని టీఆర్ఎస్ ఖాతాలోనే ప‌డ్డాయి. ఇక ఎన్నిక‌లు జ‌రిగిన కొత్త‌గూడెం మున్సిపాల్టీలో ప్రధాన విప‌క్ష‌మైన కాంగ్రెస్‌కు ఒక్క వార్డు కూడా రాలేదు. ఇక సీపీఐ త‌న స‌త్తా చాటుకుని ఏకంగా 13 వార్డులు గెలుచుకుంది. ఇక టీఆర్ఎస్‌కే చెందిన మాజీ ఎమ్మెల్యే జ‌ల‌గం వెంక‌ట్రావు ప్ర‌భావం లేదు. ఆయ‌న ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం ఎప్పుడు అయితే వ‌న‌మా టీఆర్ఎస్‌లో చేరారో రాజ‌కీయ ఆధిప‌త్యం అంతా వ‌న‌మాదే న‌డుస్తోంది.

 

ఇక కాంగ్రెస్ ఇన్‌చార్జ్ య‌డ‌వ‌ల్లి కృష్ణ ( వ‌న‌యాకు స్వ‌యానా వియ్యంకుడు ) ఉన్నా ఆయ‌న వ‌ల్ల ఒరిగిందేమి లేదు. ఆయ‌న ఇప్ప‌టికే ఆర్థికంగా దెబ్బ‌తిన్నార‌న్న టాక్ ఉంది. ఇక గ‌తంలో టీడీపీలో కీల‌కంగా ఉండి టీడీపీ జిల్లా అధ్య‌క్షుడిగా ఉన్న కోనేరు చిన్ని బీజేపీ జిల్లా అధ్య‌క్షుడిగా ఉన్నా ఆయ‌నకు పార్టీ ప‌రంగా ప‌ట్టులేక‌పోవ‌డంతో చేసేదేం లేదు.  ఇక సీపీఐకి చెందిన మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల‌తో పాటు, రాష్ట్ర స‌హాయ కార్య‌ద‌ర్శి హోదాలో ఉన్నారు. ఉన్నంత‌లో మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోసీపీఐ 13 వార్డులు గెలుచుక‌వడం గుడ్డిలో మెల్ల.

 

వార‌సుడి దూకుడు :
ఇక వ‌న‌మా వ‌య‌స్సు పైబ‌డ‌డంతో ఆయ‌న వార‌సుడు  రాఘ‌వేంద్ర‌రావు చ‌క్రం నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతున్నార‌న్న టాక్ బ‌లంగా ఉంది. ఇప్పుడు పార్టీలోనూ.. అటు ప్ర‌భుత్వ ప‌రంగా కొడుకుదే పెత్త‌న‌మంటున్నారు కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు. నియోజ‌క‌వ‌ర్గంలో బ‌దిలీలు అయినా ఏ ప‌ని జ‌ర‌గాల‌న్నా ఆయ‌న ఏం చెపితే అదే న‌డుస్తుంద‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నుంచి ఆయ‌న రంగంలో ఉంటార‌న్న ప్ర‌చారం కూడా ఉంది. అయితే ఆయ‌న వ్య‌వ‌హార శైలీపై కొన్ని విమ‌ర్శ‌లు సైతం ఉన్నాయి. ఇక గ‌తంలో పార్టీ మారేట‌ప్పుడు సీనియ‌ర్ మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న పార్టీ మారిన వ‌న‌మాకు ఇప్పుడు ఆ ఆశ‌లు లేవ‌ట‌. ఇక నామినేటెడ్ ప‌ద‌వి వ‌స్తుంద‌ని అనుకున్నా అది కూడా నెర‌వేర‌లేదు.

 

మంత్రి పువ్వాడ‌తో గ్యాప్ నిజ‌మేనా..?
ఇక ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు మంత్రిగా ఉన్నా పువ్వాడ అజ‌య్‌తో వ‌న‌మాకు గ్యాప్ వ‌చ్చింద‌ని అంటున్నారు. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో మంత్రి చెప్పిన వారెవ్వ‌రికి కౌన్సెల‌ర్ సీట్లు ఇవ్వ‌లేద‌ని అన్న ప్రచారం ఉంది. ఈ ఎన్నిక‌ల్లో కేవ‌లం త‌న సామాజిక‌వ‌ర్గ‌మైన మున్నూరు కాపుల‌కే మెజార్టీ జ‌న‌ర‌ల్ సీట్లు ఇప్పించుకున్న వ‌న‌మా చివ‌ర‌కు మునిసిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్‌, వైస్‌చైర్మ‌న్ ప‌ద‌వులు కూడా త‌న సామాజిక‌వ‌ర్గానికే ఇప్పించుకోవ‌డంతో మిగిలిన సామాజిక వ‌ర్గాలు అన్ని వ‌న‌మా తీరుపై గుర్రుగా ఉన్నాయి.

 

ఇక ఎమ్మెల్యే ఎన్నిక‌ల‌ప్పుడు టీడీపీతో పొత్తుతో త‌మ‌ను వాడుకుని ఇప్పుడు ప‌క్కన పెట్టార‌ని మ‌రి కొన్ని సామాజిక వ‌ర్గాలు సైతం ఆయ‌న‌పై అస‌హ‌నంతో ఉన్నాయి. దీనికి తోడు కొడుకు పెత్త‌నం కూడా కొంత‌మందికి న‌చ్చ‌డం లేద‌ట‌. ఇక ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు అంద‌రితోనూ స‌ఖ్య‌త‌తోనే ఉండ‌డంతో ఆయ‌న‌తో వ‌న‌మాకు వ‌చ్చిన ఇబ్బందేం లేదు. ఏదేమైనా ప‌ద‌వుల‌పై ఆశ‌ల‌తో పార్టీ మారార‌న్న టాక్ ఉన్న వ‌న‌మాకు అటు ప‌ద‌వులు రాక‌పోగా ... ఇటు అభివృద్ధి ప‌రంగాను త‌న‌దైన మ్యాజిక్ అయితే చేయ‌డం లేదు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: