2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. అయితే గెలిచిన ఎమ్మెల్యేలంతా ఒకే తీరుగా పనిచేయడం కష్టం. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పనిచేసుకుంటూ వెళ్తారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కంటే సొంత పనులు చేసుకోవడంలో బిజీగా ఉంటున్నారు. అలాగే ప్రత్యర్థుల్ని ఇబ్బందులకు గురి చేయడమే టార్గెట్ గా పనిచేస్తారు.

 

ఇక ఇదే బాటలో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ కూడా ఉన్నారని తెలుస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన ఎక్కువగా దందాలు చేయడం, ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడంపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని అంటున్నారు. అసలు నియోజకవర్గంలో అభివృద్ధి పక్కనబెట్టేసి, తమని ఇబ్బందిపెట్టడంలోనే ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నారని ప్రత్తిపాడు టీడీపీ నేతలు చెబుతున్నారు.

 

కాకపోతే ప్రభుత్వ పథకాలు మామూలుగానే అందుతున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలని ఆదుకోవడం జరుగుతుంది. ఇక ఇక్కడ టీడీపీకి ఇన్ ఛార్జ్ గా వరుపుల రాజా ఉన్నారు. ఈయన ఎన్నికల్లో ఓడిపోయాక, టీడీపీకి రాజీనామా చేసారు. కానీ మళ్ళీ సీనియర్ నేత యనమల, రాజాని బ్రతిమలాడి పార్టీలోనే ఉండేలా చేసారు.

 

దీంతో నియోజకవర్గ బాధ్యతలని రాజానే చూసుకుంటున్నారు. కానీ ఎమ్మెల్యే మాత్రం టీడీపీని వీక్ చేస్తున్నారు. వీలైనా చోట నేతలని తమ పార్టీలోకి లాగేయడం, లేదంటే వారిపై ఎస్సీ, ఎస్టీ లాంటి అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ప్రస్తుతానికైతే నియోజకవర్గంలో టీడీపీ వీక్ గానే ఉంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ మెజారిటీ స్థానాలు వైసీపీనే గెలిచే అవకాశముంది.  నియోజకవర్గంలో శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి మండలాలు ఉన్నాయి.

 

ఈ నాలుగు మండలాల్లోనూ వైసీపీ హవా బాగా ఉంది. ఇంకా ఏలేశ్వరం నగర పంచాయితీపై వైసీపీకి మంచి పట్టు ఉంది. మొత్తానికి చూసుకున్నట్లైతే ఎమ్మెల్యే పర్వత ప్రజా సమస్యల మీద కంటే ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: