ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు ఎప్పుడు ఎలా గెలుస్తారో ఎవరికీ అర్ధం కాదు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే స్వతంత్ర, ఇతర పార్టీల అభ్యర్థులే ఎక్కువ గెలిచిన విచిత్రమైన సందర్భాలు ఉన్నాయి. అయితే అలా విచిత్రమైన సందర్భాలలో 2004 కూడా ఒకటి. రాష్ట్రమంతా వైఎస్సార్ గాలి ఉన్నాసరే, పిఠాపురంలో బీజేపీ గెలిచింది.

 

బీజేపీ నుంచి పెండెం దొరబాబు విజయం సాధించారు. అయితే గెలిచాక దొరబాబు, కాంగ్రెస్ వైపుకు వచ్చేసారు. తర్వాత 2009 ఎన్నికలొచ్చేసరికి ఇక్కడ ప్రజారాజ్యం అభ్యర్థి వంగా గీత స్వల్ప మెజారిటీతో, టీడీపీ అభ్యర్థి వర్మపై గెలిచారు. ఇక దొరబాబు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడోస్థానంకి పడిపోయారు. నెక్స్ట్ 2014 ఎన్నికలల్లో మరీ విచిత్రమైన ఫలితం వచ్చింది.

 

వర్మకు టీడీపీ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి, వైసీపీ నుంచి పోటీ చేసిన దొరబాబుపై దాదాపు 47 వేలపైనే మెజారిటీతో గెలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసిన పోతుల విశ్వం మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక వర్మ నెక్స్ట్ టీడీపీలోకి వచ్చేసారు. 2019 ఎన్నికల్లో వర్మ టీడీపీ నుంచి, దొరబాబు మళ్ళీ వైసీపీ నుంచి పోటీ చేయగా, దొరబాబు 15 వేల మెజారిటీతో గెలిచారు. ఇక మొదట బీజేపీ నుంచి ఎమ్మెల్యే అయినా దొరబాబు, ఇప్పుడు వైసీపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.  వైసీపీ ఎలాగో అధికారంలోకి వచ్చింది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా దొరబాబు నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు.

 

ప్రభుత్వ పథకాలు ప్రజలకు బాగానే అందుతున్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలని ఆదుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది.  అయితే అధికార ఎమ్మెల్యేగా దొరబాబు, నియోజకవర్గంలో కాస్త దందాలు నడపడంలో బిజీగా ఉన్నారని చెబుతున్నారు. తన అనుచరుల ద్వారా పోలవరం మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, అలాగే కొన్ని భూ కబ్జాలు కూడా జరుగుతున్నాయని నియోజకవర్గంలోని కొందరు విపక్ష నేతలు చెబుతున్నారు. ఇంకా పిఠాపురంలో పేకాటకు అయితే అడ్డే లేదంటున్నారు.

 

అటు టీడీపీని వర్మ నడిపిస్తున్నారు. ఇక్కడ టీడీపీ కేడర్ స్ట్రాంగ్ గానే ఉంది. వైసీపీ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకిత టీడీపీకి ప్లస్ అవుతుందని అంటున్నారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలు పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లెల్లో టీడీపీ,వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశముంది. కాకపోతే అధికార పార్టీగా వైసీపీకి అడ్వాంటేజ్. మొత్తానికైతే ఎమ్మెల్యేగా దొరబాబు పనితీరు పెద్దగా ఏమి ఆశాజనకంగా లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: