రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది రాజకీయ నేతలు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అనుచరులుగా కొనసాగిన విషయం తెలిసిందే. అలా వైఎస్ అనుచరులుగా ఉంటూ 2009 లో కాంగ్రెస్ పార్టీ తరుపున  ఎమ్మెల్యేగా గెలిచిన నేతల్లో పొన్నాడ సతీష్ కుమార్ కూడా ఒకరు. వైఎస్ ఆశీస్సులతో సతీష్ 2009 లో తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

 

అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా సతీష్, నియోజకవర్గంలో మంచిగానే పనులు చేసుకున్నారు. అయితే తర్వాత వైఎస్ చనిపోవడం, రాష్ట్రం విడిపోవడం, జగన్ కొత్త పార్టీ పెట్టడంతో పరిణామాలు మారిపోయాయి. కానీ 2014 లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ లో ఉంటే లాభం లేదు అనుకుని, 2018 లో వైసీపీలో చేరిపోయారు.

 

ఇక 2019 ఎన్నికల్లో సతీష్, ముమ్మడివరం టికెట్ దక్కించుకుని, టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజుపై 5 వేల మెజారిటీతో గెలిచారు. అటు వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో, సతీష్ నియోజకవర్గంలో దూకుడుగా పనిచేసుకుంటున్నారు. వైయస్ తో సన్నిహితంగా ఉండే సతీష్, జగన్ తో కూడా అలాగే నడుచుకుంటున్నారు. జగన్ అండతో నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

 

కాగా,  గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ కార్యకలాపాల కారణంగా ముమ్మడివరంలో కొంతమంది మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. వారికి జీఎస్‌పీసీ ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపులో జాప్యం జరిగింది. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించింది. ఇక ముమ్మిడివరంలో డిగ్రీ కళాశాల నిర్మాణం చేపట్టనున్నారు. అటు ప్రభుత్వ పథకాలు కూడా బాగానే అందుతున్నాయి. తాజాగా సున్నా వడ్డీ పథకం, జగనన్న విద్యా దీవెనలు అందాయి.

 

అయితే మండలి రద్దు నేపథ్యంలో ఎమ్మెల్సీ ద్వారా మంత్రులైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలని, జగన్ రాజ్యసభకు పంపిస్తున్నారు. దీంతో రెండు పదవులు ఖాళీ కానున్నాయి., ఈ క్రమంలోనే మోపిదేవి సామాజికవర్గమైన మత్స్యకార వర్గానికి చెందిన పొన్నాడ సతీష్ కు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

 

ఇక నియోజకవర్గంలో టీడీపీని దాట్ల సుబ్బరాజు నడిపిస్తున్నారు. మొన్న ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతోనే ఓడిపోవడంతో, నియోజకవర్గంలో ఇంకా కష్టపడుతూ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. అటు స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఐలాండ్ పోలవరం, ముమ్మిడివరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలాలు ఉన్నాయి. ఈ నాలుగు మండలాల్లో వైసీపీకి టీడీపీ గట్టిగానే పోటీ ఇస్తుంది. అలాగే ముమ్మడివరం నగర పంచాయితీలో కూడా హోరాహోరీ పోరు జరిగే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: